Delta Airlines: న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో కలకలం.. ఢీకొన్న రెండు డెల్టా విమానాలు!

Delta Planes Collide at New York Airport
  • లగార్డియా విమానాశ్రయంలో ఘటన
  • నెమ్మదిగా వెళ్తుండగా గేటు వద్ద జరిగిన ప్రమాదం
  • ఒక విమానం రెక్క, మరో విమానం ముక్కు భాగానికి తాకిడి
  • ప్రమాదంలో ఊడిపడ్డ విమానం రెక్క
  • ఘటనలో ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలు
అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న లగార్డియా విమానాశ్రయంలో గత రాత్రి ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి గాయాలైనట్లు తెలిసింది. విమానాలు రెండూ చాలా నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది.

లగార్డియా ఎయిర్‌పోర్టులోని ఒక గేటు వద్ద డెల్టా విమానం ఒకటి ఆగి ఉంది. అదే సమయంలో ల్యాండ్ అయిన మరో డెల్టా ప్రాంతీయ విమానం కూడా అదే గేటు వైపు వస్తోంది. ఈ క్రమంలో రెండో విమానం రెక్క మొదటి విమానం ముక్కు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి రెక్క విరిగి కిందపడిపోయింది. ప్రమాదానికి డెల్టా విమానాలు డీఎల్5047, డీఎల్5155 గా అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఆడియో కూడా బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, న్యూయార్క్ నగరంలోని కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత లగార్డియా రెండో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. ఇక్కడి నుంచి ఎక్కువగా దేశీయ విమాన సర్వీసులు నడుస్తుంటాయి.
Delta Airlines
New York
LaGuardia Airport
Delta plane collision
विमान दुर्घटना
Aviation accident
Flight safety
DL5047
DL5155
Air traffic control

More Telugu News