Telangana Liquor Sales: నేడు మద్యం, మాంసం దుకాణాల బంద్.. నిన్న ఒక్క రోజే రూ. 340 కోట్లు కోట్ల మద్యం కొనేశారు!

Telangana Records Rs 340 Crore Liquor Sales Ahead of Dry Day
  • దసరా, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో డ్రై డే ప్రకటించిన ప్రభుత్వం 
  •  గత నాలుగు రోజులుగా మద్యం షాపుల వద్ద భారీగా పెరిగిన రద్దీ
  •  ముందుగానే మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న మందుబాబులు
  •  జీతాలు పడటంతో మద్యం, మాంసం కొనుగోళ్లకు ఎగబడ్డ ప్రజలు
  •  మాంసం దుకాణాల వద్ద కూడా కిటకిటలాడిన జనం
విజయదశమి, గాంధీ జయంతి పర్వదినాలు ఒకే రోజు (గురువారం) రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఈ ‘డ్రై డే’ ప్రకటనతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పండగకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఫలితంగా, పండగకు ముందు రోజైన బుధవారం ఒక్కరోజే రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా ఏకంగా రూ.340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది.

సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున రూ.100 నుంచి రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే దసరా పండగ, దానికి తోడు డ్రై డే ప్రకటనతో గత నాలుగు రోజులుగా విక్రయాలు అమాంతం పెరిగాయి. ఆదివారం రూ.280 కోట్లు, సోమవారం రూ.290 కోట్లు, మంగళవారం రూ.300 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇక బుధవారం ఉద్యోగులకు జీతాలు కూడా పడటంతో కొనుగోళ్లు తారస్థాయికి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

పండగ రోజు మద్యం దొరకదనే కారణంతో చాలామంది నాలుగైదు రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. దసరా సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగే జాతరలు, వేడుకల కోసం కూడా భారీగా ముందస్తు కొనుగోళ్లు జరిపారు.

మద్యం షాపులతో పాటు మాంసం దుకాణాల వద్ద కూడా ఇదే తరహా రద్దీ కనిపించింది. అక్టోబర్ 2న దుకాణాలు మూసి ఉంటాయని, ముందు రోజే మాంసం కొనుగోలు చేయాలని విక్రయదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు బుధవారం నాడే మాంసం కోసం ఎగబడ్డారు. వెరసి, డ్రై డే ప్రకటన ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించింది.
Telangana Liquor Sales
Telangana
liquor sales
Gandhi Jayanti
Vijaya Dashami
dry day
alcohol sales
meat sales
excise department revenue

More Telugu News