Rammohan Naidu: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభం

Rammohan Naidu Launches Rajamahendravaram to Tirupati Flight Service
  • బాలయోగి జయంతి సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
  • వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
  • మొదటి 35 టికెట్లకు ప్రత్యేక ధర రూ.1999
  • మూడు నెలల వరకు టికెట్లు బుక్.. భారీ డిమాండ్
  • వారణాసి, షిర్డీకి కూడా త్వరలో విమానాలు ప్రారంభిస్తామ‌న్న మంత్రి
గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు ఎట్టకేలకు ప్రారంభమైంది. దివంగత లోక్‌సభ స్పీకర్, గోదావరి ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన జీఎంసీ బాలయోగి జయంతిని పురస్కరించుకుని, దసరా పండుగ వేళ ఈ నూతన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు.

ఢిల్లీ నుంచి ఎంపీ పురందేశ్వరితో కలిసి ఆయన వర్చువల్ విధానంలో ఈ సర్వీసును ప్రారంభించగా, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరాన్ని ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతితో అనుసంధానించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాజమండ్రి నుంచి తిరుపతికి విపరీతమైన డిమాండ్ ఉందని, ఇప్పటికే మూడు నెలలకు సరిపడా టికెట్లు బుక్ అయ్యాయని ఆయన వెల్లడించారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి నడిచే అన్ని సర్వీసుల్లోనూ ఆక్యుపెన్సీ 100 శాతంగా ఉందని పేర్కొన్నారు. ప్రయాణికులను ప్రోత్సహించేందుకు తొలి 35 టికెట్లను రూ.1999 కే అందిస్తున్నామని, ఆ తర్వాతి 35 టికెట్లను రూ.4,000గా నిర్ణయించామని మంత్రి వివరించారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో రాజమండ్రి నుంచి వారణాసి, షిర్డీ, గోవా, కొచ్చిన్ వంటి ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, బెంగళూరుకు మరో విమానం, వారణాసికి కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
Rammohan Naidu
Rajamahendravaram
Tirupati
Flight Service
Aviation
Andhra Pradesh
GM Balayogi
Purandeswari
Godavari Districts
New Terminal

More Telugu News