Kavitha: బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: కవిత

Kavitha says she has no relation with BRS party
  • బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న కవిత
  • రెండు నెలలు ఆగి ఎన్నికలు పెడితే వచ్చే నష్టమేంటని ప్రశ్న
  • కోర్టులను ఈటల తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసమే తమ పోరాటమని ఆమె స్పష్టం చేశారు.

బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందే వరకు కేవలం రెండు నెలలు ఆగి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ఆమె ప్రశ్నించారు. ఒకవైపు జీవో ఇచ్చి, మరోవైపు తమ అనుచరులతోనే కోర్టులో కేసు వేయించారని, ఈ విషయం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైందని ఆమె వ్యాఖ్యానించారు. గ్రామాల్లో లేని సామాజికవర్గాలకు కూడా రిజర్వేషన్లు కేటాయించడం గందరగోళానికి దారితీస్తోందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను బయటపెడితే రిజర్వేషన్ల కేటాయింపులో స్పష్టత వస్తుందని కవిత సూచించారు.

ఇదే సమయంలో, స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపైనా కవిత తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేలా ఈటల మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు సొంతమా లేక పార్టీవి చెప్పించారా అని నిలదీశారు. ఈ వ్యాఖ్యల పట్ల ఈటల రాజేందర్ బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

మరోవైపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి గెజిట్ విడుదల చేసిందని ఆరోపించారు. అయితే, బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో సీఎం పాల్గొనడాన్ని ఆమె స్వాగతించారు. ఈ సందర్భంగా, తనకు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కవిత స్పష్టం చేయడం గమనార్హం. 
Kavitha
Kalvakuntla Kavitha
BRS party
BC reservations
Telangana Jagruthi
Etela Rajender
Revanth Reddy
local body elections
Telangana Thalli
caste census

More Telugu News