యుద్ధాల్లో సాంకేతికత పెరిగింది.. ఇది ఆందోళన కలిగించే అంశం: రాజ్‌నాథ్ సింగ్

  • రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి బలోపేతం కోసం వినూత్న వ్యవస్థను రూపొందిస్తామన్న కేంద్రమంత్రి
  • సాంకేతికతను మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్న కేంద్ర మంత్రి
  • రక్షణ బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతోందని వ్యాఖ్య
ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత వినియోగం ఆందోళనకరంగా పెరుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్ 278వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారత రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఒక వినూత్నమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత వినియోగం పెరగడంపై రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతలు సంవత్సరాల తరబడి పరిశోధన మరియు అభివృద్ధి ఫలితంగా రూపొందించబడినవని ఆయన పేర్కొన్నారు. మనం కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయని, దేశ భద్రతా అవసరాలు కూడా పెరుగుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

ఈ కారణంగానే రక్షణ బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతోందని ఆయన అన్నారు. బడ్జెట్ పెరుగుతున్నందున, దానిని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత కూడా రెట్టింపు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. దేశీయ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నిధులను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.


More Telugu News