నైరుతిలో కుమ్మేసిన వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు!

  • రుతుపవన కాలంలో ఈ ఏడాది భారీ వర్షాలు
  • నాలుగు నెలల్లోనే వార్షిక సగటును దాటిన వర్షపాతం
  • జల విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు
  • నాగార్జున సాగర్‌లో రెండు నెలల్లోనే వార్షిక లక్ష్యం పూర్తి
  • ఇంకా కొనసాగుతున్న నైరుతి 
  • బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి డబుల్ ధమాకా అందించాయి. ఓ వైపు రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా, మరోవైపు జల విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త చరిత్ర నమోదవుతోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం, ఏడాది మొత్తం ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్‌ను కేవలం రెండు నెలల్లోనే ఉత్పత్తి చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ ఏడాది సాగర్‌లో మొత్తం 1,450 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, జులై 29 నుంచి సెప్టెంబర్ 29 మధ్య కేవలం రెండు నెలల కాలంలోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ అరుదైన విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం అధికారులు, ఇంజనీర్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం మరో రెండు నెలల పాటు ఇలాగే కొనసాగితే, ఈ ఏడాది ఒక్క సాగర్‌లోనే 3 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జెన్‌కో సీఈ మంగేశ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022-23లో 6,831 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరగగా, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,062 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావడమే ఇందుకు నిదర్శనం.

ఏడాది సగటును దాటేసిన వానలు
ఈ జల విద్యుత్ రికార్డులకు కారణం ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలే. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో ఏకంగా 988.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ నాలుగు నెలల్లో 740.6 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అంతేకాకుండా, రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 923.8 మి.మీ. కాగా, కేవలం నాలుగు నెలల్లోనే ఆ సగటును దాటి వర్షాలు కురవడం విశేషం.

ఇంకా వీడని నైరుతి
సెప్టెంబర్ 30తో వానాకాలం ముగిసినప్పటికీ, నైరుతి రుతుపవనాలు ఇంకా పూర్తిగా వెనుదిరగలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో నిష్క్రమణ మొదలైనప్పటికీ, తెలంగాణ నుంచి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్లడానికి మరో 15 రోజులు పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అక్టోబర్ 2 నాటికి వాయుగుండంగా మారి, 3న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు, 3, 4, 5 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.


More Telugu News