Mohsin Naqvi: మొహిసిన్ నఖ్వీ తీరు పట్ల బీసీసీఐ ఫైర్

Mohsin Naqvi BCCI Fires Over Asia Cup Trophy Incident
  • నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన టీమిండియా
  • ట్రోఫీతో పాటు విజేతలకు ఇచ్చే పతకాలను తనతో తీసుకువెళ్లిన నఖ్వీ
  • ట్రోఫీ ఏసీసీకి చెందినదే కానీ వ్యక్తిగతంగా నఖ్వీకి సంబంధించినది కాదన్న రాజీవ్ శుక్లా
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు ఘన విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీ తీరుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

దుబాయ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం, నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి టీమ్‌ఇండియా నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీతో పాటు, విజేతలకు ఇచ్చే పతకాలను కూడా తనతో తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి నిన్న జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.

నఖ్వీని ప్రశ్నించిన బీసీసీఐ: వర్చువల్ రూపంలో సమావేశానికి హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ట్రోఫీ ఏసీసీకి చెందినదే కానీ వ్యక్తిగతంగా నఖ్వీకి సంబంధించింది కాదని గుర్తు చేశారు. ట్రోఫీని భారత జట్టుకు యథావిధిగా అప్పగించాల్సిన బాధ్యత నఖ్వీకి ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ఏసీసీ వెంటనే పరిశీలించాలని కోరారు.

అయితే, తన నుంచి ట్రోఫీని స్వీకరించబోమని భారత జట్టు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ పేర్కొన్నారు. అనంతరం శుక్లా మరిన్ని ప్రశ్నలు సంధించడంతో సమావేశంలో కాకుండా వేరే వేదికపై చర్చిస్తామని నఖ్వీ తెలిపారు.

ఈ క్రమంలో ట్రోఫీ గురించి బీసీసీఐ తమ వాదనను కొనసాగించింది. ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాలని, అక్కడి నుంచి తాము దాన్ని తీసుకుంటామని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి నఖ్వీ అంగీకరించలేదు. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉందని నఖ్వీ అన్నారు. దీనిపై రాజీవ్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోఫీ తమదేనని, చర్చించడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై నవంబర్‌లో జరిగే సమావేశంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. 
Mohsin Naqvi
BCCI
Asia Cup 2025
ACC
Rajeev Shukla
India vs Pakistan
Cricket Trophy
ACC AGM
Cricket Controversy
Dubai Stadium

More Telugu News