GV Prakash: 12 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. విడిపోయిన జీవీ ప్రకాశ్, సైంధవి

Chennai Court approves GV Prakash Saindhavi divorce after 12 years
  • జీవీ ప్రకాశ్-సైంధవి జంటకు అధికారికంగా విడాకులు
  • చెన్నై ఫ్యామిలీ కోర్టులో తుది తీర్పు వెల్లడి
  • పరస్పర అంగీకారంతో విడిపోయిన ప్రముఖ జంట
  • ఈ ఏడాది మార్చిలో విడాకుల కోసం పిటిషన్
  • తల్లి సైంధవి సంరక్షణలోనే ఉండనున్న కుమార్తె
  • 12 ఏళ్ల వైవాహిక బంధానికి అధికారికంగా తెర
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, గాయని సైంధవిల వైవాహిక బంధం అధికారికంగా ముగిసింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన చెన్నై ఫ్యామిలీ కోర్టు, వారికి విడాకులు మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట, ఈ ఏడాది మార్చి 24న చెన్నైలోని మొదటి అదనపు ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సెల్వ సుందరి, చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 25న కేసు మళ్లీ విచారణకు రాగా, జీవీ ప్రకాశ్, సైంధవి ఇద్దరూ స్వయంగా కోర్టుకు హాజరై విడిపోవాలన్న తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. విచారణ సందర్భంగా వారి కుమార్తె ఎవరి వద్ద ఉంటుందని న్యాయమూర్తి ప్రశ్నించగా, చిన్నారి తల్లి సైంధవి సంరక్షణలోనే ఉండటానికి జీవీ ప్రకాశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

ఇరువర్గాల అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, వారి విడాకులను ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. కాగా, 2013లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2020లో ఒక కుమార్తె జన్మించింది. విడాకుల అనంతరం పాప తల్లి సైంధవి వద్దే పెరగనుంది.
GV Prakash
GV Prakash Kumar
Saindhavi
divorce
Tamil Nadu
Chennai Family Court
Kollywood
music director
singer
celebrity divorce

More Telugu News