Kumaraswamy: కేంద్రంతో ఘర్షణ వద్దు.. నరేంద్ర మోదీని నమ్మండి: సిద్ధరామయ్య ప్రభుత్వానికి కేంద్రమంత్రి సూచన

Kumaraswamy Urges Karnataka Govt to Trust Modi Avoid Conflicts
  • వరద బీభత్సం సృష్టిస్తుంటే ఒక్క మంత్రి తనను కలవలేదని విమర్శ
  • మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క మంత్రి తనను కలవలేదన్న కుమారస్వామి
  • ఏసీ రూముల్లో కూర్చుని సమయం వృధా చేస్తే సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడవద్దని, అలాంటి చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వవని కేంద్ర మంత్రి కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విశ్వసించాలని అన్నారు. మీ విజ్ఞప్తిని ఆయనకు సమర్పిస్తే, కేంద్రం తప్పకుండా స్పందిస్తుందని తెలిపారు. కేంద్రం పట్ల అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిని విడనాడాలని ఆయన హితవు పలికారు.

ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక్క మంత్రి కానీ, అధికారి కానీ కేంద్ర మంత్రులను కలవలేదని ఆయన ఆరోపించారు. సహాయక చర్యలు చేపట్టడానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిందని, కానీ ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఒక్క మంత్రి కూడా వచ్చి తనను కలవలేదని ఆయన అన్నారు.

విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కులగణన వంటి అసంబద్ధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇది కొత్త సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా, అవి ప్రజలకు మేలు చేస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా బెంగళూరు నగర పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావించారు. ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదని, పైగా ఇప్పుడు బస్సు ఛార్జీలు పెంచడంలో ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం పోటీ పడుతోందని విమర్శించారు. బెంగళూరు నగరంలో ఏసీ గదుల్లో కూర్చుని సమయం వృథా చేస్తే సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని హితవు పలికారు.

వరదల కారణంగా కర్ణాటక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. మీడియా, ప్రతిపక్షాలు వరద అంశంపై ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారని వ్యాఖ్యానించారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లేదంటే వారం రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండేవాడినని అన్నారు.

రైతులను ఆదుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 35 శాతం రుణాలను పంపిణీ చేశానని తెలిపారు. ప్రస్తుతం రుణ పంపిణీ 17 శాతానికి పడిపోయిందని కుమారస్వామి పేర్కొన్నారు.
Kumaraswamy
Karnataka
Narendra Modi
Central Government
Siddaramaiah
Congress
Floods

More Telugu News