RV Karnan: హైదరాబాద్ లో ఎల్లుండి మాంసం, మద్యం బంద్

Hyderabad Meat Liquor Sales Banned on October 2 Due to Gandhi Jayanti
  • అక్టోబర్ 2న దసరా పండుగ
  • అదే రోజున గాంధీ జయంతి
  • గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం అమ్మకాలు బంద్
దసరా పండుగ వేళ (అక్టోబర్ 2) హైదరాబాద్ లో మాంసం, మద్యం బంద్ కానుంది. అదే రోజున గాంధీ జయంతి రావడంతో వీటిపై నిషేధం ఉండనుంది. ఆ రోజున నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రిటైల్ మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లు, స్లాటర్ హౌస్‌లను (కబేళాలు) అక్టోబర్ 2న తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ నిబంధనను పాటిస్తున్నట్లు కమిషనర్ తన ప్రకటనలో గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ చట్టం 1955, సెక్షన్ 533B కింద స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సాధారణంగా దసరా పండుగ రోజు మాంసం అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. ఈసారి గాంధీ జయంతి కారణంగా దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలు రావడంతో విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. పండుగ సీజన్‌లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు వాపోతున్నారు. దీంతో మాంసం ప్రియులు దసరా వేడుకల కోసం ఒకరోజు ముందుగానే మాంసం కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
RV Karnan
Hyderabad
Gandhi Jayanti
GHMC
Meat Ban
Liquor Ban
Dussehra
Telangana
Meat Shops
Slaughter Houses

More Telugu News