Quetta Blast: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో భారీ పేలుడు... 13 మంది మృతి!

Quetta Blast kills 13 in Pakistan
  • పారామిలిటరీ దళాలపై బాంబు దాడి
  • 13 మంది మృతి, 32 మందికి పైగా గాయాలు
  • దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు
పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో భారీ పేలుడు సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పారామిలిటరీ దళాలపై జరిగిన ఈ బాంబు దాడిలో కనీసం 13 మంది మృతి చెందగా, 32 మందికి పైగా గాయపడ్డారు. క్వెట్టాలోని ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే కాల్పుల మోత కూడా వినిపించింది.

ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. బలూచిస్థాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ మహమ్మద్ కాకర్ ఈ దాడిని ధృవీకరించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అయితే, బలూచ్ తిరుగుబాటు గ్రూపులు తరుచూ భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి. ఈ దాడిని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్పరాజ్ ఖండించారు. ఇది ఉగ్రదాడి అని ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదులు పిరికి చర్యల ద్వారా దేశం యొక్క సంకల్పాన్ని బలహీనపరచలేరని ఆయన అన్నారు. ప్రజలు, భద్రతా దళాల త్యాగాలు వృధా కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
Quetta Blast
Pakistan blast
Balochistan
Quetta
Balochistan blast
Pakistan
Frontier Corps

More Telugu News