Ram Gopal Varma: ప్రభాస్ 'రాజా సాబ్' ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ

Ram Gopal Varma Reviews Prabhas Raja Saab Trailer
  • నిన్న ప్రభాస్ 'ది రాజా సాబ్' ట్రైలర్ రిలీజ్ 
  • వర్మ ప్రశంసల వర్షం
  • ప్రభాస్‌లో కొత్త కోణాన్ని చూపిస్తున్నారంటూ కితాబు
  • వర్మ ట్వీట్‌కు స్పందించిన దర్శకుడు మారుతి
  • తన కెరీర్‌కు వర్మనే స్ఫూర్తి అని వెల్లడి
సంచలన వ్యాఖ్యలకు, విలక్షణమైన అభిప్రాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న 'ది రాజా సాబ్' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారంటూ చిత్ర బృందాన్ని, ముఖ్యంగా దర్శకుడు మారుతిని ఆయన అభినందించారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. "చాలా ఏళ్లుగా ప్రభాస్‌లోని తీవ్రమైన కోణాన్నే చూస్తున్నాం. కానీ, 'ది రాజా సాబ్' పోస్టర్ చూస్తుంటే ఇది కేవలం ఇంటెన్స్ లేదా ఛార్మ్ మాత్రమే కాదు, ప్రభాస్‌లోని అత్యుత్తమ అంశాలన్నింటినీ కలిపిన ఒక మల్టీ మసాలా మిక్స్‌లా ఉంది," అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్న నిర్మాత విశ్వప్రసాద్ గారికి, ముఖ్యంగా ఇలాంటి ప్రభాస్‌ను చూపిస్తున్నందుకు డైరెక్టర్ మారుతికి ధన్యవాదాలు అని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు.

రామ్ గోపాల్ వర్మ ప్రశంసలపై దర్శకుడు మారుతి స్పందిస్తూ, భావోద్వేగభరితమైన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్ ఆరంభం వెనుక వర్మ స్ఫూర్తి ఉందని ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "థాంక్యూ సర్. మీ 'దొంగల ముఠా' సినిమా చూసి స్ఫూర్తి పొందే, 5డి కెమెరాతో 'ఈ రోజుల్లో' సినిమా తీశాను. నా తొలి సినిమా టైటిల్స్‌లో మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపాను" అని మారుతి గుర్తుచేసుకున్నారు.

అంతటితో ఆగకుండా, "ఇన్నాళ్ల ప్రయాణం తర్వాత మీ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది. డార్లింగ్ ప్రభాస్‌లోని మరో కోణాన్ని చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను" అని మారుతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
Ram Gopal Varma
Prabhas
Raja Saab
Maruthi
The Raja Saab trailer review
Telugu cinema
Director Maruthi
RGV review
Viswa Prasad
Tollywood

More Telugu News