Vangalapudi Anitha: స్కూటీపై వెళుతున్న బాలురను మందలించిన హోంమంత్రి అనిత... ఎందుకంటే...!

Vangalapudi Anitha stops convoy to advise minors on scooter
  • విజయనగరం పర్యటనలో హోంమంత్రి వంగలపూడి అనిత
  • స్కూటీపై వేగంగా వెళుతున్న మైనర్ల గుర్తింపు
  • వెంటనే కాన్వాయ్ ఆపి చిన్నారులకు హితవు
  • మైనర్లు వాహనాలు నడపడం, మైనర్లకు వాహనాలివ్వడం నేరమని సున్నిత హెచ్చరిక
  • తల్లిదండ్రులకు కబురు పెట్టాలని పోలీసులకు ఆదేశం
  • జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచాలని సూచన
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపారు. అధికారిక పర్యటనలో ఉన్న ఆమె... స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా వెళుతున్న ఇద్దరు మైనర్లను చూసి వెంటనే స్పందించారు. వారికి సున్నితంగా నచ్చజెప్పి, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఘటన గురువారం విజయనగరం జిల్లా పర్యటనలో చోటుచేసుకుంది.

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అనిత చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో, ఇద్దరు మైనర్లు ఓ స్కూటీపై అతివేగంగా దూసుకురావడాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేయమని సిబ్బందిని ఆదేశించి, ఆ చిన్నారుల వద్దకు వెళ్లారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి, వారికి ప్రేమగా హితవు పలికారు. "మైనర్ వయసులో వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. తల్లిదండ్రులు మీకు వాహనాలు ఇవ్వడం కూడా తప్పే. ఈ వయసులో మీరు చదువుపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలి" అని వారికి అర్థమయ్యేలా వివరించారు. మంత్రి మాటలను శ్రద్ధగా విన్న ఆ చిన్నారులు, ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబుతామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసు అధికారులతో మంత్రి మాట్లాడారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆదేశించారు. సుమారు 10 నిమిషాల పాటు అక్కడే ఉండి, జిల్లాలో మైనర్ల డ్రైవింగ్‌ను అరికట్టాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 
Vangalapudi Anitha
Home Minister Anitha
Vizianagaram
Minor driving
Traffic rules
Road safety
Chintalavalasa
Police department
Traffic awareness

More Telugu News