మంత్రి సెంథిల్ బాలాజీ వల్లే 41 మంది మృతి.. సూసైడ్ నోట్ రాసి విజయ్ పార్టీ నేత ఆత్మహత్య

  • విల్లుపురంలో టీవీకే నేత అయ్యప్పన్ ఆత్మహత్య
  • కరూర్ తొక్కిసలాటకు మంత్రి సెంథిల్ బాలాజీ కారణమని ఆరోపణ
  • ఆయనను అరెస్ట్ చేయాలని సూసైడ్ నోట్‌లో డిమాండ్ 
ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందినా కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, పోలీసులే కారణమంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది.  విల్లుపురం జిల్లాకు చెందిన అయ్యప్పన్ (51) టీవీకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం మయిలం గ్రామంలో ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను చూసేందుకు ఆయన వెళ్లారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక గదిలో ఉరి వేసుకుని కనిపించారు. ఆయన తల్లి మునియమ్మల్ గమనించి, చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో వారు సెంజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహం వద్ద ఒక చేతిరాత లేఖను స్వాధీనం చేసుకున్నారు. "విజయ్ కరూర్‌కు వచ్చినప్పుడు పోలీసులు సరైన భద్రత కల్పించలేదు. విజయ్ అభిమానులు బాగా పనిచేశారు. ఆ విషాదానికి సెంథిల్ బాలాజీనే కారణం. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉంది. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి" అని ఆ లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

విజయ్ ప్రచార కార్యక్రమం కోసం కరూర్‌కు వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. అయ్యప్పన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియాంబక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.  


More Telugu News