ఖతార్ ప్రధానికి సారీ చెప్పిన నెతన్యాహు.. వైట్ హౌస్ నుంచి ఫోన్ కాల్
- దోహాపై ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడి
- హమాస్ నేతలను మట్టుబెట్టేందుకేనని అప్పట్లో వివరణ
- ఇజ్రాయెల్ దాడిపై ట్రంప్ ఆగ్రహం
- నెతన్యాహుతో సారీ చెప్పించిన అమెరికా అధ్యక్షుడు
అసలేం జరిగిందంటే..
గాజా యుద్ధం, హమాస్ తో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడితో చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాషింగ్టన్ వెళ్లారు. సోమవారం వైట్ హౌస్ లో నెతన్యాహుతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దోహాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారని, ఓవైపు శాంతి చర్చలు జరుపుతుండగా దాడి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
ఖతార్ తమకు మంచి మిత్రుడని ట్రంప్ తరచుగా మీడియా ముందు వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చి ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానికి ఫోన్ చేయించారని, దోహా దాడికి క్షమాపణ చెప్పించారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఖతార్ కూడా ఈ ఫోన్ కాల్ నిజమేనని నిర్ధారించింది. దోహాపై దాడి పట్ల నెతన్యాహు విచారం వ్యక్తం చేశారని, భవిష్యత్తులో అలాంటి దాడులు పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చారని ఖతార్ పేర్కొంది.