Tilak Varma: ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. పాక్ స్లెడ్జింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!

Tilak Varma Grand Welcome in Hyderabad Interesting Comments on Pak Sledging
  • ఆసియా కప్ గెలిచి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ
  • శంషాబాద్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం పలికిన ఫ్యాన్స్
  • సన్మానించిన తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు
  • ఫైనల్లో పాక్ ఆటగాళ్లు తీవ్రంగా స్లెడ్జింగ్ చేశారన్న తిలక్
  • వారి మాటలకు తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చానని వెల్లడి
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన తెలుగు తేజం, యువ క్రికెటర్ తిలక్ వర్మకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. ఆసియా కప్‌లో తొమ్మిదోసారి భారత్‌ను విజేతగా నిలిపిన అనంతరం సోమవారం తన సొంత నగరానికి చేరుకున్న తిలక్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు, క్రీడా శాఖ అధికారులు నీరాజనాలు పలికారు.

విమానాశ్రయానికి చేరుకున్న తిలక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన కారు ఎక్కగానే చుట్టుముట్టి 'తిలక్.. తిలక్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహానికి స్పందించిన తిలక్, కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశాడు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలా దేవి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

పాక్ ఆటగాళ్ల నుంచి ఎదురైన స్లెడ్జింగ్
ఈ టోర్నీలో ముఖ్యంగా ఫైనల్లో పాక్ ఆటగాళ్ల నుంచి ఎదురైన స్లెడ్జింగ్ గురించి తిలక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను క్రీజులోకి వచ్చినప్పుడు పాకిస్థాన్‌ ఆటగాళ్లు చాలా మాటలు అన్నారని, వారిని మాటలతో కాకుండా తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. "వారు చాలా విషయాలు మాట్లాడుతూ రెచ్చగొట్టారు. వాళ్ల మాటలకు నా బ్యాట్‌తోనే బదులివ్వాలనుకున్నాను. ఇప్పుడు వాళ్లు మైదానంలో ఎక్కడా కనిపించడం లేదు" అని బీసీసీఐ.టీవీలో శివమ్ దూబేతో మాట్లాడుతూ తిలక్ పేర్కొన్నాడు.

విమానాశ్రయంలో తిలక్ సోదరుడు తరుణ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ తన తమ్ముడి ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. "ఫైనల్ లాంటి మ్యాచ్‌లో అంత ఒత్తిడిలో తిలక్ అద్భుతంగా ఆడాడు. అతని ఆటతీరు చాలా గర్వంగా ఉంది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం" అని అన్నారు.

కాగా, ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, శివమ్ దూబేతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 53 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Tilak Varma
Asia Cup 2025
India vs Pakistan
Shivam Dube
Sledging
Cricket
Hyderabad
Telangana
Indian Cricket Team
Tarun Varma

More Telugu News