Vijayawada Utsav: విజయవాడ ఉత్సవాలకు దేశవ్యాప్త గుర్తింపు.. మైసూరును దాటేశాయన్న మంత్రి రామ్మోహన్ నాయుడు

Vijayawada Utsav Surpasses Mysore Celebrations Says Rammohan Naidu
  • విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు
  • మైసూరు, కోల్‌కతా ఉత్సవాలను మించిపోయిందన్న రామ్మోహన్ నాయుడు
  • ఉత్తరాంధ్ర, రాయలసీమ కళాకారులకు పెద్దపీట వేయడంపై ప్రశంస
  • అక్టోబర్ 2న 3 వేల మంది కళాకారులతో మెగా కార్నివాల్‌కు ఏర్పాట్లు
  • ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యమన్న ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడలో జరుగుతున్న ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన మైసూరు, కోల్‌కతా వేడుకలను సైతం అధిగమించాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. ‘విజయవాడ ఉత్సవ్‌’ జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుందని ఆయన అన్నారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని)తో కలిసి పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న వేడుకలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. పండుగలు, ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించి, మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడతాయని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి సుదూర ప్రాంతాల నుంచి కళాకారులను ఆహ్వానించి, కళావైభవానికి పెద్దపీట వేయడం అద్భుతమని కొనియాడారు. సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధితో పాటు కళల పరిరక్షణకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళలకు, సంస్కృతికి విజయవాడ నగరం రాజధాని వంటిదని అన్నారు. ఈ ఉత్సవాల స్ఫూర్తితో అక్టోబర్ 2వ తేదీన బందరు రోడ్డులో ఒక చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. సుమారు 3 వేల మంది కళాకారులతో ‘మెగా కార్నివాల్’ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
Vijayawada Utsav
Rammohan Naidu
Keshineni Srinivas
Vijayawada
Andhra Pradesh
Arts and Culture
Tourism
Festival
Mega Carnival
Chandrababu Naidu

More Telugu News