రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల

  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్
  • 71 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల
  • రూ. 3,200 కోట్ల కుంభకోణంలో ఏ-4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి
  • విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఊరట
  • మిథున్ రెడ్డితో పాటు మరో ముగ్గురు వైసీపీ నేతలకూ బెయిల్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ, వైసీపీ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. సుమారు 71 రోజుల పాటు జైలులో ఉన్న ఆయన సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు నేడు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిథున్ రెడ్డి విడుదల నేపథ్యంలో జైలు వెలుపల సందడి నెలకొంది. ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 3,200 కోట్లకు పైగా మద్యం కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డిని ఏ-4 నిందితుడిగా పేర్కొంటూ జూలై 20న అరెస్ట్ చేశారు. షెల్ కంపెనీల ద్వారా భారీ మొత్తంలో ముడుపులు సేకరించి, వాటిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చేరవేశారని ఛార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపారు.

అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ కోసం మిథున్ రెడ్డి పలుమార్లు ప్రయత్నించారు. మొదట హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెప్టెంబర్ 6న ఏసీబీ కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. ఓటు వేసిన అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. ఇటీవల సెప్టెంబర్ 19న సిట్ అధికారులు ఆయనను విజయవాడ కార్యాలయంలో విచారించారు.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కె. ధనుంజయ్ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజి గోవిందప్పకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఈ స్కామ్‌పై ఏసీబీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది. 


More Telugu News