Salman Ali Agha: ఇది క్రికెట్‌ను అవమానించడమే: టీమిండియాపై పాక్ సారథి ఫైర్

Pakistan Captain Salman Agha Fumes In Press Conference Calls Indias Conduct Disrespectful
  • ఆసియా కప్ ఫైనల్ ఓటమి తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా అసంతృప్తి
  • భారత జట్టు ప్రవర్తన క్రికెట్‌ను అగౌరవపరచడమేనని వ్యాఖ్య
  • ఏసీసీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీని భారత్ తిరస్కరించడంపై విమర్శలు
  • సూర్యకుమార్ ప్రైవేట్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చాడని సల్మాన్ వెల్లడి
  • కెమెరాల ముందు మాత్రం కరచాలనానికి నిరాకరిస్తున్నారని ఆరోపణ
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా చేతిలో ఎదురైన ఓటమి కంటే, టోర్నీలో భారత జట్టు ప్రవర్తించిన తీరే తమను తీవ్రంగా నిరాశపరిచిందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత జట్టు వైఖరి క్రికెట్‌ను అగౌరవపరిచేలా ఉందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

"ఈ టోర్నమెంట్‌లో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. మాతో కరచాలనం చేయకపోతే మమ్మల్ని అవమానించినట్లు వారు భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. వారు క్రికెట్‌ను అగౌరవపరుస్తున్నారు. ఈ రోజు వారు చేసిన పని ఏ మంచి జట్టూ చేయదు" అని సల్మాన్ అన్నాడు. తాము ఓడిపోయినా పతకాల కోసం వేచి చూశామని, కానీ భారత జట్టు ప్రవర్తన మాత్రం భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.

ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై స్పందిస్తూ, సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఆట పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుపై నేను కఠినమైన పదాలు వాడాలనుకోవడం లేదు. కానీ ఇది చాలా అగౌరవమైన ప్రవర్తన" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదే సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సల్మాన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. "టోర్నమెంట్ ప్రారంభంలో సూర్యకుమార్ నాతో ప్రైవేట్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, రిఫరీ మీటింగ్‌లో కూడా కలిసినప్పుడు ఇచ్చాడు. కానీ కెమెరాల ముందుకు వచ్చేసరికి మాత్రం కరచాలనం చేయడానికి ఇష్టపడడు. బహుశా అతను పైనుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నాడని నేను భావిస్తున్నాను" అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.

కాగా, సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఇక ఫైనల్ అనంతరం ట్రోఫీని తిరస్కరించినప్పటికీ, భారత ఆటగాళ్లు తమ సంబరాలను యథావిధిగా కొనసాగించారు. కెప్టెన్ సూర్యకుమార్.. చేతిలో కప్పు లేకపోయినా ట్రోఫీ పట్టుకున్నట్లుగా పోడియంపై సంబరాలు చేసుకోవడం గమనార్హం.
Salman Ali Agha
Pakistan Captain
Pakistan
Team India
Cricket
Sports News

More Telugu News