Team India: ఫొటోషాప్ చేసిన ఫొటోలతో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా!

Tam India Celebrates Victory With Digital Trophy
  • ఆసియా కప్ ఫైనల్‌లో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
  • పాక్ బోర్డు ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు ఆటగాళ్ల నిరాకరణ
  • కప్‌ను తనతో పాటు హోటల్‌కు తీసుకెళ్లిన ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
  • సోషల్ మీడియాలో 'ట్రోఫీ ఎమోజీ'తో ఫోటోలు పోస్ట్ చేసిన టీమిండియా ప్లేయర్లు
  • ఇది తమకు అవమానమంటూ సూర్యకుమార్ యాదవ్ ఆవేదన
  • ఏసీసీ ఛైర్మన్ చర్యలపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్న బీసీసీఐ
ఆసియాకప్ విజయోత్సవ వేడుకలో భారత జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. అయితే, ఈ అవమానానికి టీమిండియా ఆటగాళ్లు సాంకేతికతను ఆయుధంగా చేసుకుని పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా ఆటగాళ్లు 'డిజిటల్ నిరసన'కు దిగారు.
 
గత రాత్రి హోరాహోరీగా సాగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన నఖ్వీ విజేతలకు అందజేయాల్సిన ట్రోఫీని తనతో పాటే హోటల్‌కు తీసుకువెళ్లడం క్రీడాస్ఫూర్తికే మాయని మచ్చగా నిలిచింది.

ఈ అనూహ్య పరిణామంతో భారత ఆటగాళ్లు ఖాళీ వేదికపైనే విజయాన్ని జరుపుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ అవమానాన్ని వారు మౌనంగా భరించలేదు. సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో జట్టు సభ్యులతో దిగిన ఫోటోను పోస్ట్ చేసి, ట్రోఫీ ఉండాల్సిన చోట ఒక 'ట్రోఫీ ఎమోజీ'ని ఎడిట్ చేసి పెట్టాడు. దానికి "ఆట ముగిశాక చాంపియన్లనే గుర్తుంచుకుంటారు కానీ ట్రోఫీ చిత్రాన్ని కాదు" అంటూ పదునైన వ్యాఖ్యను జోడించాడు. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయింది. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి ఇతర ఆటగాళ్లు కూడా ఇదే తరహాలో ఫోటోషాప్ చేసిన చిత్రాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూర్యకుమార్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. "నా కెరీర్‌లో ఇంతటి వింత ఘటనను ఎప్పుడూ చూడలేదు. అద్భుతమైన విజయం సాధించిన ఒక చాంపియన్ జట్టుకు దక్కాల్సిన గౌరవం ఇది కాదు. కష్టపడి గెలిచిన ట్రోఫీని మాకు ఇవ్వలేదు. ఆ ట్రోఫీకి మేం నూటికి నూరు శాతం అర్హులం" అని ఆయన స్పష్టం చేశారు.

రంగంలోకి బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు!
ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ "ఎమిరేట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ఖలీద్ అల్ జరూనీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరిస్తామని మేం ముందుగానే ఏసీసీకి తెలియజేశాం. కానీ, నఖ్వీ మా అభ్యర్థనను తోసిపుచ్చారు. భారత ఆటగాళ్లు ట్రోఫీని తిరస్కరించడంతో ఆయన దానిని తన హోటల్ గదికి తీసుకెళ్లిపోయారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని అన్నారు. మొహ్సిన్ నఖ్వీ చర్యపై ఈ ఏడాది నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో అధికారికంగా ఫిర్యాదు చేసి గట్టిగా నిలదీస్తామని బీసీసీఐ తేల్చి చెప్పింది. 
Team India
Asia Cup
Pakistan
Dubai
Suryakumar Yadav
Hardik Pandya

More Telugu News