నా అభిప్రాయాలను పిల్లలపై రుద్దను: హీరో అజిత్

  • తన విజయాల వెనుక అర్ధాంగి షాలినిది కీలక పాత్ర అన్న అజిత్
  • తన అర్ధాంగి ఎన్నో పనులు చక్కబెడుతుందని కితాబు 
  • పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమైందని వెల్లడి
తన విజయాల వెనుక భార్య షాలినిది కీలక పాత్ర అని చెబుతూ ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో అజిత్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారన్న అంశంపై స్పందించారు.  
 
ఆమె మద్దతు లేకపోతే ఇవన్నీ సాధ్యపడేవి కావు

అజిత్ మాట్లాడుతూ తన అర్ధాంగి షాలిని ఎన్నో పనులు చక్కబెడుతుందని అన్నారు. ఆమె సహకారం లేకపోతే తాను ఇదంతా చేసేవాడిని కాదని పేర్కొన్నారు. మేము 2002లో పెళ్లి చేసుకున్నాం. అప్పటినుంచి ఆమె నాకు బలంగా నిలిచింది. రేసింగ్‌కి తిరిగి వచ్చినప్పుడు కూడా ఆమె నాతోపాటే వచ్చేదన్నారు.
 
పిల్లలు పుట్టిన తర్వాత షాలిని ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయినా, మోటార్ స్పోర్ట్‌ పై ఆసక్తిని కొనసాగిస్తోందని తెలిపారు. తన కొడుకు కూడా ప్రస్తుతం గో-కార్టింగ్ ప్రారంభించాడని, కానీ రేసింగ్‌ను కొనసాగిస్తాడో లేదో అతడే నిర్ణయించుకోవాలని తాను భావిస్తున్నానన్నారు. 
 
 పిల్లలు ఇష్టమైన దారిని ఎంచుకోవాలి

"సినిమాలు అయినా, రేసింగ్ అయినా – నా అభిప్రాయాలను పిల్లలపై రుద్దను. వారు తమ ఇష్టమైన దారిని ఎంచుకోవాలి. వారికి నేను పూర్తి మద్దతు ఇస్తాను" అని అజిత్ పేర్కొన్నారు. 
 
అలాగే వృత్తిపరంగా తరచూ ప్రయాణాల్లో ఉండే తాను, పిల్లలతో గడిపే సమయం కోల్పోతున్నానని, కానీ ఏదైనా నిజంగా ప్రేమిస్తే కొన్ని త్యాగాలు అవసరమవుతాయని అజిత్ భావోద్వేగంగా వెల్లడించారు.
 
రేసింగ్‌ అజిత్ – అంతర్జాతీయ స్థాయిలో విజయం
 
ప్రొఫెషనల్ రేసర్‌గా కూడా అజిత్ తనదైన గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో జరిగిన 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్ పోటీలో ఆయన టీమ్ మూడో స్థానం దక్కించుకుంది. ఇటీవల ఇటలీలో జరిగిన 12H రేస్ లోనూ మూడో స్థానం పొందారు.
 
సినిమాల్లోనూ జోరు

ఈ ఏడాది అజిత్ నటించిన ‘పట్టుదల’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే తన తదుపరి సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.


More Telugu News