రౌఫ్‌కు అతని స్టైల్‌లోనే బుమ్రా బదులు.. ఫైనల్‌లో అదిరిపోయే రివెంజ్!

  • రౌఫ్‌ను బౌల్డ్ చేసి, విమానం కూలినట్టు బుమ్రా సంబరాలు
  • గతంలో రౌఫ్ చేసిన వివాదాస్పద సంబరానికి బదులు తీర్చుకున్న వైనం
  • భారత అభిమానులను రెచ్చగొట్టినందుకు రౌఫ్‌పై బీసీసీఐ ఫిర్యాదు
  • వివాదాస్పద సంబరాలకు రౌఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించిన ఐసీసీ
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ చేసిన వివాదాస్పద సంబరాలకు, అతని వికెట్ తీసి మరీ అదే రీతిలో సమాధానం ఇచ్చాడు. 

మ్యాచ్ కీలక దశలో బుమ్రా వేసిన నిప్పులు చెరిగే యార్కర్‌కు రౌఫ్ వద్ద సమాధానం లేకపోయింది. బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ను గిరాటేయడంతో రౌఫ్ పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడే అసలు సీన్ మొదలైంది. రౌఫ్ వెనుదిరుగుతుండగా, బుమ్రా 'విమానం కూలిపోతున్నట్టుగా' సైగ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ అనూహ్య పరిణామం చూసి అభిమానులు, రౌఫ్ సైతం ఆశ్చర్యపోయారు.

అసలు విషయానికొస్తే, గత ఆదివారం సూపర్ 4 మ్యాచ్‌లో రౌఫ్ ఇలాంటి సంబరాలే చేసుకుని వివాదంలో చిక్కుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతడిని భారత అభిమానులు 'కోహ్లీ-కోహ్లీ' అంటూ నినాదాలతో ఆటపట్టించారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ తన బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్లను గుర్తుచేయడమే వారి ఉద్దేశం. దీనికి ఆగ్రహించిన రౌఫ్, భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాకిస్థాన్ చేసే వాదనలకు గుర్తుగా విమానం కిందకు పడిపోతున్నట్టు సైగలు చేశాడు.

రౌఫ్ ప్రవర్తనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. భారత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించాడంటూ ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ, రౌఫ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే ఫైనల్‌లో అతడి వికెట్ తీసిన బుమ్రా.. అదే తరహాలో సంబరాలు జరుపుకుని బదులు తీర్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




More Telugu News