Tilak Varma: తిలక్ వర్మ అదరహో... ఆసియా కప్ మనదే.. ఫైనల్లో పాక్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!

Tilak Varma Shines India Wins Asia Cup Thrilling Victory Over Pakistan
  • ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
  • 5 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా
  • నాలుగు వికెట్లతో పాక్‌ను దెబ్బతీసిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
  • అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించిన తిలక్ వర్మ
  • కీలక సమయంలో రాణించిన శివమ్ దూబే
  • దుబాయ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్
ఆసియా కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మాయాజాలం చేయగా, బ్యాటింగ్‌లో యువ ఆటగాడు తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 147 పరుగుల ఛేజింగ్ లో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది.

147 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), శుభ్‌మన్ గిల్ (12) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ (69 నాటౌట్), సంజూ శాంసన్ (24)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. శాంసన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (33)తో కలిసి తిలక్ వర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దూబే కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో వేగంగా ఆడి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. 

చివర్లో దూబే ఔటైనా, తిలక్ వర్మ సంయమనంతో ఆడి జట్టును గెలిపించాడు. పాక్ సీనియర్ పేసర్ హరీస్ రవూఫ్ విసిరిన చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 10 పరుగులు అవసరం కాగా... తిలక్ వర్మ ఓ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. రింకూ సింగ్ విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టడంతో భారత్ టోర్నీ విజేతగా అవతరించింది.

అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్... పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. పాక్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) రాణించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయడంతో పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన, ఆ తర్వాత తిలక్ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత్ ఆసియా కప్ గెలవడం ఇది 9వ సారి కావడం విశేషం.

కాగా, ఈసారి ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడగా, అన్నింటా భారత జట్టే విజయం సాధించింది. ఆసియా కప్ చరిత్రలో భారత్-పాక్ జట్లు ఫైనల్ లో తలపడడం ఇదే మొదటిసారి కాగా, భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. 
Tilak Varma
India vs Pakistan
Asia Cup 2025
Kuldeep Yadav
Shivam Dube
Cricket
India win
Haris Rauf
Dubai Cricket Stadium
Rinku Singh

More Telugu News