Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ‘భూత కోల’... భగ్గుమన్న భక్తులు!

Tirumala Brahmotsavam Bhuta Kola Sparks Controversy
  • శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భూత కోల ప్రదర్శన
  • తీవ్ర వివాదంగా మారిన జానపద నృత్యం
  • ఇది హిందూ సంప్రదాయం కాదంటూ భక్తుల ఆగ్రహం
  • ఆత్మలకు సంబంధించిన పూజగా ఆరోపణలు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘భూత కోల’ అనే నృత్య ప్రదర్శన తీవ్ర దుమారం రేపుతోంది. ఇది హిందూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, ఇలాంటి కార్యక్రమాలను పవిత్రమైన తిరుమల కొండపై ఎలా అనుమతిస్తారని భక్తులు, నెటిజన్లు టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈ భూత కోల ప్రదర్శనను నిర్వహించారు. అయితే, ఈ ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ‘భూత కోల’ అనేది ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు చేసే ఒక ఆచారమని, దీనిని ఆలయాలలో, ముఖ్యంగా తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో ప్రదర్శించడం సరైంది కాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది హిందూ సంప్రదాయంలో భాగం కాదని స్పష్టం చేస్తున్నారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. "కొంచెం కూడా అవగాహన లేకుండా ఇలాంటి ప్రదర్శన ఎలా ఏర్పాటు చేస్తారు?" అంటూ టీటీడీ అధికారుల తీరును తప్పుబడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణం బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. "అసలు తిరుమలలో ఆగమ శాస్త్ర నిపుణులు, పండితులు ఏం చేస్తున్నారు? వారి పర్యవేక్షణ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా?" అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

'కాంతార' చిత్రం ద్వారా భూత కోల నృత్యం గురించి అందరికీ పరిచయం అయిన విషయం తెలిసిందే.
Tirumala Brahmotsavam
TTD
Bhuta Kola
Tirumala
Hindu traditions
Lord Venkateswara
Brahmotsavam
Kantara movie
Hindu rituals
Agama Shastra

More Telugu News