Mary Kom: దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఇంట్లో దొంగల హల్‌చల్.. లక్షల విలువైన సొత్తు మాయం!

Mary Kom House Robbed Valuables Stolen
  • ఫరీదాబాద్‌లోని నివాసంలోకి చొరబడ్డ దొంగలు
  • టీవీ సహా లక్షల విలువైన వస్తువులు అపహరణ
  • సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దొంగల కదలికలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరు బృందాలతో గాలింపు
  • వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు విషయం తెలిసిన మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 46లో ఉన్న ఆమె నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మేరీ కోమ్ ఓ కార్యక్రమం నిమిత్తం మేఘాలయలో ఉండగా, ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. లక్షల రూపాయల విలువైన వస్తువులను అపహరించుకుపోయారు.

మేరీ కోమ్ తన రెండంతస్తుల బంగళాకు కొన్ని రోజులుగా తాళం వేసి మేఘాలయలోని సోహ్రాలో జరుగుతున్న మారథాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులతో పాటు ఓ టెలివిజన్‌ను కూడా ఎత్తుకెళ్లారు. దొంగలు ఇంట్లో నుంచి వస్తువులను బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

పొరుగువారు ఈ విషయాన్ని గమనించి మేరీ కోమ్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ, "నాకు చాలా భయంగా, ఆందోళనగా ఉంది. ఈ చోరీ ఈ వారం మొదట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. 24న ఈ ఘటన జరిగిందని పొరుగువారు చెప్పారు. నేను ఇంటికి తిరిగి వెళ్లాకే నష్టం ఎంత జరిగిందో కచ్చితంగా చెప్పగలను. సీసీటీవీ ఫుటేజీలో దొంగలు టీవీ, ఇతర వస్తువులు తీసుకెళ్లడం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చాను" అని తెలిపారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Mary Kom
Mary Kom theft
Mary Kom robbery
Faridabad
Boxing champion
Meghalaya
Theft
Crime
CCTV footage

More Telugu News