HSRP plates: వాహనదారులకు బిగ్ రిలీఫ్.. హై సెక్యూరిటీ ప్లేట్లపై ఎలాంటి గడువు లేదు!

HSRP Plates Telangana No Deadline for Old Vehicles
  • సెప్టెంబర్ 30 గడువంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న రవాణాశాఖ
  • వాహనదారులకు ఎలాంటి జరిమానాలు విధించడం లేదని స్పష్టత
  • ఆందోళన చెందవద్దని వాహనదారులకు అధికారుల సూచన
పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) మార్చుకోవాలంటూ జరుగుతున్న ప్రచారంపై రవాణా శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఈ ప్లేట్లు బిగించుకోకపోతే జరిమానాలు తప్పవనే వార్తల్లో నిజం లేదని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

గత కొన్ని రోజులుగా పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లు తప్పనిసరి అని, నిర్దేశిత గడువులోగా మార్చుకోని వారిపై ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని రవాణా శాఖ అధికారులు పూర్తిగా ఖండించారు. పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లు బిగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి పాత వాహనాలకు నంబర్ ప్లేట్ల మార్పు అంశం ప్రభుత్వ పరిశీలన దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని వివరించారు. ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, నంబర్ ప్లేట్ల మార్పుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని రవాణా శాఖ వర్గాలు ప్రజలకు సూచిస్తున్నాయి.
HSRP plates
High Security Registration Plates
Telangana Transport Department
Vehicle Registration
Number Plates
RTA
Traffic Police
Vehicle owners

More Telugu News