Salman Ali Agha: అలా ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధమే.. ఫైనల్ ముంగిట‌ పాక్ కెప్టెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Salman Ali Agha says there is pressure in India Pakistan final
  • ఆసియా కప్ ఫైనల్ ముందు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ప్రెస్ మీట్
  • భారత్‌తో మ్యాచ్ అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న పాక్ సారథి
  • ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధమని వ్యాఖ్య
  • టోర్నీలో రెండుసార్లు ఓడినా ఫైనల్లో గెలుస్తామని ధీమా 
  • ఫొటోషూట్ వివాదంపై ఆసక్తికరంగా స్పందించిన సల్మాన్ ఆఘా
ఆసియా కప్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు జరగనున్న టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో ఫైనల్ అంటే ఇరు జట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, అది లేదని ఎవరైనా చెబితే పచ్చి అబద్ధం చెప్పినట్టేనని ఆయన కుండబద్దలు కొట్టాడు.

ఈ టోర్నమెంట్‌లో గ్రూప్ దశలో, సూపర్ 4లో ఇప్పటికే రెండుసార్లు భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది. అయినప్పటికీ, ఫైనల్లో విజయం తమదేనని సల్మాన్ ధీమా వ్యక్తం చేశాడు. "ఫైనల్లో మేమే గెలుస్తాం. మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే మా లక్ష్యం. మా ప్రణాళికలను 40 ఓవర్ల పాటు సరిగ్గా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడించగలమని మాకు తెలుసు" అని పేర్కొన్నాడు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో తక్కువ తప్పులు చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని సల్మాన్ తెలిపాడు. "ఇప్పటివరకు మేం వాళ్లకంటే ఎక్కువ తప్పులు చేశాం. అందుకే మ్యాచ్‌లు గెలవలేకపోయాం. ఫైనల్లో ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే కప్ గెలుస్తారు" అని అన్నాడు.

ఫైనల్‌కు ముందు జరిగే సంప్రదాయ ఫొటోషూట్‌కు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాజరుకాకపోవడంపై అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఆఘా స్పందిస్తూ, "ఆ కార్యక్రమానికి రావాలా? వద్దా? అనేది పూర్తిగా ఆయన ఇష్టం. అందులో నేను జోక్యం చేసుకోలేను" అని బదులిచ్చాడు.

ఈ టోర్నీలో టాస్ గెలిచిన జట్లే ఎక్కువగా గెలుస్తున్నప్పటికీ, ఫైనల్లో టాస్ పెద్ద ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డాడు. "టాస్ మన చేతుల్లో ఉండదు. బహుశా మేం మా అత్యుత్తమ బ్యాటింగ్‌ను ఫైనల్ కోసమే దాచుకున్నామేమో" అని ఆయన వ్యాఖ్యానించడం ఉత్కంఠను రేపుతోంది.
Salman Ali Agha
Pakistan cricket
India vs Pakistan
Asia Cup 2025
cricket final
Suryakumar Yadav
cricket
match preview
tournament

More Telugu News