Ashok Reddy: 60 ఏళ్ల తర్వా ఉస్మాన్ సాగర్‌కు భారీ వరద.. గేట్లు ఎత్తి మూసీలోకి నీరు విడుదల చేశాం: జలమండలి ఎండీ

Osman Sagar Gates Opened After 60 Years Due to Heavy Floods
  • గంటల్లోనే గండిపేటకు 16 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని వెల్లడి
  • శంకర్ పల్లి వంతెన నీటిమట్టం 16.5 అడుగులకు చేరిందని వెల్లడి
  • ఎగువ ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపిన ఎండీ
ఆరు దశాబ్దాల అనంతరం ఉస్మాన్ సాగర్‌కు భారీ వరద వచ్చిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కారణంగానే 15 గేట్లు ఎత్తి మూసీ నదిలోకి వరద నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కురిసిన విస్తారమైన వర్షాల ఫలితంగా గంటల వ్యవధిలోనే గండిపేటకు 16 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ మూసీలోకి నీటిని విడుదల చేసినట్లు ఆయన వివరించారు.

డ్యామ్ నిర్మాణం సమయంలోనే ఎంత వరద వస్తే ఎంత నీటిని విడుదల చేయాలనే సాంకేతిక అంశాలను స్పష్టంగా పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ఆ సూచనల ఆధారంగానే గండిపేట గేట్లను ఎత్తినట్లు ఆయన స్పష్టం చేశారు.

గత పాతికేళ్లలో శంకర్‌పల్లి వంతెన వద్ద నీటి మట్టం 10 అడుగులు కూడా దాటలేదని, కానీ ఈసారి ఏకంగా 16.5 అడుగులకు చేరుకుందని ఆయన వెల్లడించారు. వరద ఉద్ధృతిని అంచనా వేసి నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా అందుతున్న సమాచారంతో పాటు, వాతావరణ శాఖ అందించిన డేటా ఆధారంగా ఎగువ ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Ashok Reddy
Osman Sagar
Himayat Sagar
Hyderabad Floods
River Musi
Telangana Rains
Vikarabad
Gandipet
Water Release

More Telugu News