Nadendla Manohar: నిబంధనల కన్నా మానవత్వమే ముఖ్యం: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar Prioritizes Humanity Over Regulations
  • కొల్లేరు సమస్యలపై సచివాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి సమీక్ష
  • అటవీ అధికారుల తీరుపై మంత్రులకు ఏలూరు జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదు
  • నిబంధనల పేరుతో ప్రాథమిక సౌకర్యాలు అడ్డుకుంటున్నారని ప్రజాప్రతినిధుల ఆవేదన
  • మానవీయ కోణంలో పనిచేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం
  • త్వరలోనే మరో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ
  • అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం
కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిబంధనల చట్రంలో చూడకుండా, మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల కన్నా మానవత్వమే ముఖ్యం అని స్పష్టం చేశారు. కొల్లేరు వాసుల కనీస అవసరాలైన తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనలో అటవీ శాఖ అధికారుల తీరుపై జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రుల ఎదుట ఏకరువు పెట్టారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు నిబంధనల పేరుతో అడ్డుపడుతున్నారని, కనీసం జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు కూడా హాజరుకావడం లేదని వారు ఆరోపించారు.

కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, లంక గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొండికోడు రోడ్డు మరమ్మతులకు అనుమతులు ఇవ్వాలని కోరగా, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు 64 నోటిఫైడ్ డ్రెయిన్ల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, నూజివీడు నియోజకవర్గంలో రెవెన్యూ, అటవీ భూముల మధ్య సరిహద్దు వివాదం ఉందని, వెంటనే జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి హద్దులు నిర్ణయించాలని సూచించారు. ఆర్ఓఎఫ్ఆర్ భూములకు పట్టాలు ఇచ్చి, సాగునీటి కోసం బోర్లు వేసుకునేందుకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏలూరులో నగరవనం ఏర్పాటును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అధికారులను కోరారు.

ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోవడంలో అధికారులు విఫలం కావొద్దన్నారు. అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ అంశాలపై త్వరలోనే మరో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి పూర్తిస్థాయి పరిష్కార నివేదికలతో హాజరుకావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, సొంగా రోషన్ కుమార్, పలువురు అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Nadendla Manohar
Kolleeru
Eluru district
Andhra Pradesh
Forest department
Drinking water
Roads
Infrastructure development
MLA meeting

More Telugu News