KTR: వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయబోరు: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య

KTR predicts Revanth Reddy wont contest from Kodangal
  • బీఆర్ఎస్‌లో చేరిన కొడంగల్‌కు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు
  • సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డిపై రగిలిపోతున్నారని వ్యాఖ్య
  • కొడంగల్‌కు రేవంత్ రెడ్డి చక్రవర్తి ఏమీ కాదన్న కేటీఆర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు పథకాన్ని రేవంత్ రెడ్డి బంద్ చేస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురించి అందరి కంటే ఎక్కువగా కొడంగల్ ప్రజలకే తెలుసని కేటీఆర్ అన్నారు.

కొడంగల్‌కు రేవంత్ రెడ్డి చక్రవర్తి ఏమీ కాదని, ఆయనపై ప్రజలకు ఆగ్రహం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ నియోజకవర్గానికి తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శించారు. ఆయనకు కలెక్టర్, ఎస్పీ వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేస్తున్నారని, అందుకే జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Kodangal
Telangana Elections
BRS
Congress
Local Body Elections

More Telugu News