Gudivada Amarnath: బాలకృష్ణ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారు: గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath alleges YSRCP leaders arrest to divert Balakrishna issue
  • రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన అమర్నాథ్
  • పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారని విమర్శ
  • జైల్లో మిథున్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని వెల్లడి
రాష్ట్రంలో అధికార కూటమి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు గుడివాడ అమర్నాథ్, విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ములాఖత్‌లో కలిశారు. అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

"రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలతో చెలరేగిన దుమారాన్ని పక్కదారి పట్టించడానికి మరో వైసీపీ నేత ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారు" అని అమర్నాథ్ ఆరోపించారు. గతంలో కల్తీ లడ్డూ అన్నారని, ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటున్నారని, కానీ ఎక్కడా తమపై అభియోగాలను నిరూపించలేకపోతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. జైల్లో మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని, ఇలాంటి కుట్రలను, అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారని తెలిపారు. మిథున్ రెడ్డికి ఉత్తరాంధ్ర వైసీపీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Gudivada Amarnath
YS Jagan Mohan Reddy
Andhra Pradesh politics
AP Liquor Scam
Mithun Reddy
Balakrishna
TDP government
Peddireddy Ramachandra Reddy
YSRCP
diversion politics

More Telugu News