Raj Kundra: రాజ్ కుంద్రాకు ఈడీ షాక్.. బిట్‌కాయిన్ కేసులో ఛార్జిషీట్, శిల్పాశెట్టి పేరు ప్రస్తావన

Raj Kundra Faces ED Charge Sheet in Bitcoin Money Laundering Case
  • బిట్‌కాయిన్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం
  • రాజ్ కుంద్రా వద్ద రూ.150 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు
  • ఆదాయం దాచేందుకే శిల్పాశెట్టితో ఆర్థిక ఒప్పందం
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చుట్టూ న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది. సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో రాజ్ కుంద్రా పేరును చేర్చడంతో పాటు పలు కీలక ఆరోపణలు చేసింది.

క్రిప్టో కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రాకు రూ.150 కోట్ల విలువైన 285 బిట్‌కాయిన్లు అందినట్లు ఈడీ తన ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది. కుంద్రా ఉద్దేశపూర్వకంగానే ఈ బిట్‌కాయిన్ల లావాదేవీలను, వాటికి సంబంధించిన వాలెట్ వివరాలను దాచిపెట్టారని ఈడీ ఆరోపించింది. ప్రస్తుతం ఆ బిట్‌కాయిన్లు ఆయన నియంత్రణలోనే ఉన్నాయని, వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొంది.

ఈ వ్యవహారంలో తన ఆదాయ వనరులను దాచిపెట్టేందుకు రాజ్ కుంద్రా తన భార్య శిల్పాశెట్టితో ఓ ఆర్థిక ఒప్పందం చేసుకున్నారని కూడా ఈడీ ఛార్జిషీట్‌లో ప్రస్తావించడం గమనార్హం.

ఇదిలా ఉండగా, శిల్పాశెట్టి దంపతులు ఇప్పటికే మరో కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను విచారించారు. ఇదే కేసుకు సంబంధించి వారిద్దరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు మరిన్ని న్యాయపరమైన చిక్కుల్లో పడినట్టయింది. 
Raj Kundra
Shilpa Shetty
Bitcoin scam
ED charge sheet
Money laundering case
Amit Bhardwaj
Cryptocurrency fraud
Mumbai police
Lookout notice

More Telugu News