Suryakumar Yadav: సూపర్ ఓవర్ థ్రిల్లర్.. అంతకు మించి సూర్య చేసిన పనికి ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో

Suryakumar Yadavs gesture wins hearts in India vs Sri Lanka Asia Cup match
  • పుట్టెడు దుఃఖంలో ఉన్న శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే
  • వెల్లలాగేను ఆప్యాయంగా పలకరించి ఓదార్చిన భారత కెప్టెన్ 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • సూర్య క్రీడాస్ఫూర్తిపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
  • ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సూప‌ర్ ఓవ‌ర్‌లో నెగ్గిన భారత్
ఆసియా కప్‌లో భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపినా.. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ప‌ని అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాడు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడని తెలుసుకుని, అతడి వద్దకు వెళ్లి ఓదార్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రీడాస్ఫూర్తికి అసలైన అర్థం ఇదేనంటూ అభిమానులు సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..!
శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు ఈ టోర్నమెంట్ వ్యక్తిగతంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సెప్టెంబర్ 18న ఆఫ్ఘ‌నిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతని తండ్రి గుండెపోటుతో మరణించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ సనత్ జయసూర్య, టీమ్ మేనేజర్ ఈ విషయాన్ని అతనికి తెలియజేశారు. దీంతో హుటాహుటిన స్వదేశానికి వెళ్లి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకుని, తిరిగి జట్టుతో కలిశాడు.

ఈ నేపథ్యంలో నిన్న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్లలాగే బరిలోకి దిగాడు. ఈ విషయం తెలిసిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మైదానంలో నేరుగా అతని వద్దకు వెళ్లాడు. వెల్లలాగే భుజంపై చేయి వేసి, గుండెపై చేయి పెట్టుకుని ఓ అన్నలా ధైర్యం చెప్పాడు. సూర్య ఆప్యాయంగా మాట్లాడుతుండగా, వెల్లలాగే చిరునవ్వుతో తలూపుతూ విన్నాడు. ఈ దృశ్యం కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో, కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య చూపిన ఈ చొరవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సూపర్ ఓవర్‌లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
ఇక మ్యాచ్ విషయానికొస్తే, చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సంక విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. దీంతో శ్రీలంక కూడా సరిగ్గా 202 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది.

విజేతను తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 2 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 3 పరుగుల లక్ష్యాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకే బంతిలో ఛేదించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
Suryakumar Yadav
India vs Sri Lanka
Asia Cup 2025
Dunith Wellalage
Super Over thriller
Cricket
Sportsmanship
Arshdeep Singh
Pathum Nissanka
Abhishek Sharma

More Telugu News