Chandrababu Naidu: ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పలువురు ఎమ్మెల్యేల తీరు .. సీఎం చంద్రబాబు ఆగ్రహం!

Chandrababu Naidu Angered by MLAs Behavior Damaging Government Reputation
  • శాసనసభలో వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలను సున్నితంగా మందలించిన సీఎం చంద్రబాబు
  • సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలుసునని హెచ్చరిక
  • పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు సూచనలు చేయాలన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్ష ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు శాసనసభ వేదికగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడంపై ఆయన స్పందించారు. నిన్న సాయంత్రం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించగా, వారిలో కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిలకు ఆయన సున్నితంగా క్లాస్ తీసుకున్నారు.

‘‘అసెంబ్లీలో ఏమి మాట్లాడాలో తెలియదా? ఇలా మాట్లాడటం పార్టీకి నష్టదాయకం. మీరు అధికార పార్టీ సభ్యులై ఉండి ప్రతిపక్ష సభ్యులుగా వ్యవహరించడం ఏమిటి?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గురువారం శాంతిభద్రతలపై జరిగిన చర్చలో సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేసింది.

‘‘ఒక సీఐ బదిలీ కోసం సభలో మాట్లాడటమా? ఇదేమైనా పార్టీ సమావేశమా? ఇది ప్రజాసంభాషణ వేదిక. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు అసెంబ్లీలో తగవు,’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలుసునని ఆయన హెచ్చరించారు.

అదే సమయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను ఉద్దేశించి ‘‘పార్టీ నాయకుల ప్రవర్తనపై మీరు బాధ్యత తీసుకోవాలి. నియంత్రణ లేకుండా మాట్లాడితే పార్టీకి మచ్చ’’ అని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పటికీ, తాము తప్పులు చేస్తే ప్రతిపక్షానికి మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుందని సీఎం హెచ్చరించారు.

‘‘ప్రతిపక్షం లేకపోయినా, మీరు ప్రతిపక్షం కన్నా తీవ్రంగా మాట్లాడుతున్నారు. నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రోజుకు 15 గంటలపాటు కృషి చేస్తున్నాను. మీరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా?’’ అని ఆయన ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆలస్యంగా రావడం, మధ్యాహ్నం వెళ్లిపోవడం వంటి చర్యలపై కూడా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యేలు సభకు ఐదు నిమిషాల ముందే హాజరుకావాలి. సభ ముగిసే వరకు అక్కడే ఉండాలి. సభ ఒక దేవాలయం. సభ్యులంతా క్రమశిక్షణతో ఉండాలి,’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఈ అంశాలపై టీడీపీ శాసనసభాపక్షం సభ్యులకు గట్టి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, శనివారం అసెంబ్లీ కొనసాగుతుండడం, ఇతర కార్యక్రమాల వల్ల ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP Assembly
TDP MLAs
Kuna Ravi Kumar
Bojjala Sudheer Reddy
Palla Srinivas
Assembly Conduct
Government Reputation
Political News

More Telugu News