Daggumati Venkata Krishna Reddy: ఏపీలో ఓ టీడీపీ ఎమ్మెల్యేకి సైబర్ నేరగాడు టోకరా.. బ్యాంక్ ఖాతా నుంచి రూ.23 లక్షలు మాయం

Daggumati Venkata Krishna Reddy TDP MLA Loses 23 Lakhs in Cyber Fraud
  • ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యక్తిగత వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన లింక్
  • లింక్ క్లిక్ చేయడంతో బ్లాక్ అయిన సిమ్
  • గత నెల 25 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దశల వారీగా రూ.23,16,009లను కాజేసిన సైబర్ నేరగాడు
  • కావలి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు 
సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులను సైతం చాకచక్యంగా మోసం చేస్తున్నారు. సెల్ ఫోన్‌లకు వచ్చే అనధికార లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే సైతం సైబర్ నేరగాడి చేతిలో మోసపోయారు. ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ. 23 లక్షలు సైబర్ నేరగాళ్లు తస్కరించారు.

వివరాల్లోకి వెళితే.. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వ్యక్తిగత వాట్సాప్ నెంబర్‌కు గత నెల 22న ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ ఓ లింక్ వచ్చింది. తన కంపెనీ వాహనాలకు సంబంధించిన బకాయిలుగా భావించిన ఎమ్మెల్యే ఆ లింక్‌ను ఓపెన్ చేయడంతో వెంటనే సిమ్ కార్డ్ బ్లాక్ అయింది.

దీంతో ఆయన వెంటనే హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. సుమారు 25 రోజుల తర్వాత సిమ్ యాక్టివేట్ అయింది. అయితే గత నెల 25 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు తన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ ద్వారా దశలవారీగా రూ. 23,16,009 లను కాజేసినట్లు తేలింది.

ఈ విషయాన్ని ఆయన కంపెనీ సిబ్బంది ద్వారా ఆలస్యంగా గుర్తించారు. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించిన ఆయన కావలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
Daggumati Venkata Krishna Reddy
TDP MLA
Andhra Pradesh
Cyber Crime
Online Fraud
Bank Account Hacked
Kavali
Nellore District
Cyber Police
UPI Fraud

More Telugu News