Tirumala Laddu: లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. సిట్ దర్యాప్తున‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Supreme Court Green Signal to SIT Probe in Laddu Adulterated Ghee Case
  • తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తునకు సుప్రీం ఆమోదం
  • విచారణపై హైకోర్టు విధించిన స్టేను నిలిపివేసిన సర్వోన్నత న్యాయస్థానం
  • దర్యాప్తు అధికారి నియామకంలో తప్పులేదని స్పష్టం చేసిన సీజేఐ ధర్మాసనం
  • టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ చిన్నప్పన్నకు నోటీసులు జారీ
  • కేసు తదుపరి విచారణ నవంబరు 14కు వాయిదా
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తునకు మార్గం సుగమమైంది. ఈ కేసు విచారణను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) యథావిధిగా తన విచారణను కొనసాగించవచ్చని శుక్రవారం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ జె. వెంకట్రావు నియామకాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు, విచారణ బాధ్యతలను సిట్ మరో అధికారికి అప్పగించడంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. "సిట్ దర్యాప్తు పర్యవేక్షణను వదిలేయలేదు కదా! కేవలం తన నియంత్రణలో పనిచేసే అధికారిని మాత్రమే నియమించుకుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తు అధికారి వెంకట్రావు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అయిన కదురు చిన్నప్పన్నకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే, వెంకట్రావు నియామకం చెల్లదంటూ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సిట్ దర్యాప్తుపై స్టే విధిస్తూ జూలై 10న తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. చిన్నప్పన్న తరఫు న్యాయవాది, దర్యాప్తు అధికారి ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించగా, "అలాంటి బెదిరింపులు ఉంటే ఫిర్యాదు చేయండి, అంతేకానీ విచారణకు రాననడం సరికాదు" అని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.

వాదనల అనంతరం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం, ప్రతివాదిగా ఉన్న చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది.
Tirumala Laddu
YV Subba Reddy
laddu prasadam
TTD
Andhra Pradesh High Court
Supreme Court
adulterated ghee
SIT investigation
CBI
kaduru chinna panna

More Telugu News