Chaitanyananda Saraswati: దుబాయ్‌లో చదివిస్తానంటూ వల.. స్వామీజీ అసలు స్వరూపం బయటపెట్టిన మాజీ విద్యార్థిని

Chaitanyananda Saraswati Sexual Harassment Allegations Emerge From Former Student
  • చైతన్యానంద స్వామి తనపై కన్నేశాడన్న 2016 నాటి బాధితురాలు
  • అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ 'బేబీ', 'స్వీట్ గర్ల్' అని పిలిచేవాడని ఆరోపణ
  • దుబాయ్‌లో చదివిస్తానని ఆశపెట్టి హాస్టల్‌లో ఒంటరిగా నిర్బంధించాడని ఆవేదన
  • ప్రస్తుతం 17 మంది విద్యార్థినుల లైంగిక వేధింపుల కేసులో స్వామి పరారీ
  • దేశవ్యాప్తంగా గాలిస్తున్న పోలీసులు, లుక్అవుట్ సర్క్యులర్ జారీ
స్వయం ప్రకటిత బాబా చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 17 మంది విద్యార్థినుల కేసులో పరారీలో ఉన్న ఆయనపై, 2016లో కేసు పెట్టిన ఒక బాధితురాలు తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. "చైతన్యానంద నా పట్ల రాబందులా వ్యవహరించాడు" అంటూ తన గోడును వెళ్లబోసుకున్నారు.

2016లో ఢిల్లీలోని శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో చేరినప్పుడు తన వయసు 20 ఏళ్లని, అది తన జీవితంలో అత్యంత భయంకరమైన సమయమని ఆమె తెలిపారు. "ఇనిస్టిట్యూట్‌లో చేరిన వెంటనే బాబా నాకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. నన్ను 'బేబీ', 'స్వీట్ గర్ల్' అని పిలిచేవాడు. సాయంత్రం 6:30 గంటలకు క్లాసులు ముగిశాక తన ఆఫీసుకు పిలిపించుకుని వేధించేవాడు" అని ఆమె ఆరోపించారు.

తనలో ఎంతో ప్రతిభ ఉందని, దుబాయ్‌కి తీసుకెళ్లి తన సొంత ఖర్చులతో చదివిస్తానని చైతన్యానంద ఆశ చూపినట్లు బాధితురాలు వివరించారు. "నాకు అస్సలు ఇష్టం లేకపోయినా, అతడి సిబ్బంది నాపై ఒత్తిడి తెచ్చేవారు. నా మొబైల్ ఫోన్ లాక్కుని, హాస్టల్‌లో ఒంటరిగా ఉండేలా చేశారు. ఎవరితోనూ మాట్లాడనిచ్చేవారు కాదు. రాత్రిపూట నా గదిలోని ఫోన్‌కు కాల్ చేసేవాడు" అని ఆమె తెలిపారు.

ఒకసారి తనను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడని, మధురకు తనతో పాటు రమ్మని బలవంతం చేశాడని ఆమె చెప్పారు. ఆ భయంతోనే ఎవరికీ చెప్పకుండా హాస్టల్‌లోని వస్తువులన్నీ వదిలేసి పారిపోయానని తెలిపారు. ఆ తర్వాత బాబా తన అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి పంపడంతో కొందరు విద్యార్థులు తన ఇంటికి వచ్చి, తిరిగి రావాలంటూ ఒత్తిడి చేశారని, కానీ తన తండ్రి వారిని తరిమికొట్టారని ఆమె గుర్తుచేసుకున్నారు.

పోలీసు రికార్డుల ప్రకారం చైతన్యానంద తన పలుకుబడి ఉపయోగించి 2009, 2016 సంవత్సరాల్లో నమోదైన లైంగిక వేధింపుల కేసుల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 17 మంది విద్యార్థినులు ఈ ఏడాది ఆగస్టులో సంయుక్తంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  ఆ సమయంలో ఆయన లండన్‌లో ఉన్నట్లు భావించినా, తర్వాత ఆగ్రాలో ఆయన ఆచూకీ లభ్యమైంది. ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి, కొన్ని రోజులకే దానిని వెనక్కి తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం పరారీలో ఉన్న చైతన్యానంద కోసం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతను దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.
Chaitanyananda Saraswati
Chaitanyananda
Swami Chaitanyananda
Sexual Harassment
Delhi Sri Sharada Institute
Student Harassment
Dubai Education
Agra Police
Lookout Circular
Sexual Assault

More Telugu News