YVS Chowdary: సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరికి మాతృవియోగం

YVS Chowdary Mother Yalamanchili Ratnakumari Passes Away
  • వైవీఎస్ చౌదరి తల్లి యలమంచిలి రత్నకుమారి కన్నుమూత
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • తల్లిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
  • మా అమ్మ చదువుకోని ఆర్థిక నిపుణురాలని పేర్కొన్న చౌదరి
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వైవీఎస్ చౌదరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి యలమంచిలి రత్నకుమారి (88) నిన్న రాత్రి 8:31 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చికిత్స పొందుతూ కన్నుమూశారు. తల్లి మరణంతో వైవీఎస్ చౌదరి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వైవీఎస్ చౌదరి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అనే సామెతకు మా అమ్మ నిలువెత్తు నిదర్శనం. కానీ, లారీ డ్రైవర్ అయిన మా నాన్నగారి నెల జీతంతోనే తన ముగ్గురు పిల్లలకు పౌష్టికాహారం, చదువులు, వైద్యం, పండుగలు, వేడుకలు వంటి అన్ని అవసరాలను తీర్చిన గొప్ప ఆర్థిక నిపుణురాలు మా అమ్మ" అని ఆయన పేర్కొన్నారు.

"తెల్లవారుజామునే లేచి, పనిమనిషి సహాయం లేకుండా అన్నీ తానై మమ్మల్ని పెంచడానికి తన జీవితాన్నే అంకితం చేసిన ఆదర్శమూర్తి ఆమె. మా అమ్మకు తెలిసిన లెక్కలు, మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ నేర్పించలేనిది. అలాంటి గొప్ప వ్యక్తి, ఈ భువి నుంచి సెలవు తీసుకుని స్వర్గంలో ఉన్న మా నాన్నగారిని, అన్నగారిని కలుసుకోవడానికి వెళ్లిపోయారు" అంటూ వైవీఎస్ చౌదరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పోస్ట్ చూసిన అభిమానులు, శ్రేయోభిలాషులు రత్నకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
YVS Chowdary
Yalamanchili Ratnakumari
YVS Chowdary mother
Telugu director
Tollywood director
Obituary
Death
Condolences
Telugu cinema
Family

More Telugu News