Chiranjeevi: నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టే స్పందిస్తున్నా... అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి క్లారిటీ

Chiranjeevi Clarifies Balakrishnas Comments in Assembly
  • పరిశ్రమ సమస్యలు వివరించేందుకే భేటీ అయ్యానన్న మెగాస్టార్
  • కొవిడ్ కారణంగా ఐదుగురికే అనుమతి అని జగన్ అన్నారని గుర్తుచేశారు
  • ఆ సమయంలో బాలకృష్ణ ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని వివరణ
  • సభలో తన పేరు ప్రస్తావనకు రావడంతోనే ఈ వివరణ ఇస్తున్నట్లు వెల్లడి
ఇవాళ ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాడు టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు జగన్ ఆసక్తి చూపలేదని, చిరంజీవి గట్టిగా అడగడంతోనే జగన్ దిగొచ్చాడని, టాలీవుడ్ పెద్దలను కలిశాడని ఇవాళ్టి సభా సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అయితే, కామినేని వ్యాఖ్యలను బాలయ్య తప్పుబట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ సమావేశానికి ఒప్పుకున్నాడన్నది అబద్ధం అని ఖండించారు. ఆ సైకో గాడ్ని కలిసేందుకు ఇండస్ట్రీ వాళ్లు వెళ్లిన సమయంలో చిరంజీవికి అవమానం జరిగిందన్నది నిజమేనని అన్నారు.

ఈ వ్యాఖ్యలపైనే తాజాగా చిరంజీవి స్పందించారు. నాడు తనను జగన్ సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి వెల్లడించారు. అపాయింట్ మెంట్ ఇస్తే సినీ పరిశ్రమ ముఖ్యులందరం కలిసి వస్తామని జగన్ కు చెప్పానని వివరించారు. నాటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే తాను ఆయన నివాసానికి వెళ్లానని స్పష్టం చేశారు. ఆ భేటీలో... సినీ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ కు వివరించానని తెలిపారు. కాగా, అప్పుడు కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో, ఐదుగురే రావాలని జగన్ చెప్పారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అయితే, తాము 10 మందిమి వస్తామని చెప్పామని, అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. అప్పుడు, బాలకృష్ణ ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని అన్నారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టే తాను వివరణ ఇస్తున్నానని చిరంజీవి స్పష్టం చేశారు.

"ఏపీ అసెంబ్లీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలకు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాట్లాడుతూ “చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు జగన్ దిగొచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ” అంటూ ” ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినీమాటోగ్రఫీ మినిస్టరును కలవడన్నాడట” అంటూ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు... తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్, ఎన్టీ రామారావు, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్ లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు ఆయన నాకు ఫోన్ చేసి... ముఖ్యమంత్రి గారు ముందు మీతో ఒన్ టు ఒన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నినాని నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్.నారాయణ మూర్తితో సహా మరి కొంతమందిని తీసుకువెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను" అని చిరంజీవి ఓ పత్రికా ప్రకటనలో వివరించారు. 
Chiranjeevi
YS Jagan
Balakrishna
AP Assembly
Telugu Film Industry
Tollywood
Andhra Pradesh Politics
Kamineneni Srinivas
Covid pandemic
Telugu Cinema

More Telugu News