Suresh Babu: అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కడప మాజీ మేయర్

Suresh Babu Ready to Quit Politics if Corruption Proven
  • అనర్హత వేటు తర్వాత తొలిసారి స్పందించిన సురేశ్ బాబు
  • మాధవీరెడ్డికి నగర అభివృద్ధిపై శ్రద్ధ లేదని వ్యాఖ్య
  • తనను రాజకీయంగా అడ్డుకోవాలనే వేటు వేశారని మండిపాటు
తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే వెంటనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడప మాజీ మేయర్, వైసీపీ నేత సురేశ్ బాబు సవాల్ విసిరారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసిన అనంతరం ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

తనపై, అంజాద్ బాషాపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ జిల్లా నేత వాసు వ్యాఖ్యలపై సురేశ్ బాబు తీవ్రంగా స్పందించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం నీరు-చెట్టు, బుగ్గవంక సుందరీకరణ పనుల పేరుతో ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకుతిన్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కడప అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు. కనీసం కార్పొరేటర్, సర్పంచ్ కూడా కాని వ్యక్తి అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీరుపై కూడా సురేశ్ బాబు మండిపడ్డారు. ఆమెకు నగరాభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని, కేవలం కార్పొరేషన్‌లో తన కుర్చీ కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ నిధులతో మున్సిపల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన విద్యా వాలంటీర్ల నియామక తీర్మానాన్ని ఎమ్మెల్యే అడ్డుకోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరు కార్పొరేటర్లు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించారని సురేశ్ బాబు అన్నారు. తనను రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలనే కుట్రతోనే అనర్హత వేటు వేయించారని ఆరోపించారు. అయితే, ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యేను మేయర్ కుర్చీలో కూర్చోనివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. తన కుటుంబం పేరిట అభివృద్ధి పనులు కేటాయించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అది అధికారుల తప్పిదం వల్లే జరిగిందని వివరణ ఇచ్చారు.
Suresh Babu
Kadapa
YSRCP
corruption allegations
Andhra Pradesh politics
TDP
Vasudev Reddy
Kadapa development
Anjad Basha
disqualification

More Telugu News