చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చాడా?... అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ

  • జగన్ హయాంలో సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందన్న బాలకృష్ణ
  • ఆనాడు ఎవరూ గట్టిగా ప్రశ్నించలేకపోయారని వ్యాఖ్య
  • జగన్‌తో భేటీకి నాకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని వెల్లడి
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు అవమానం జరిగిందని అన్నారు. 

అసెంబ్లీలో ప్రసంగిస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాలకృష్ణ మాట్లాడారు. ఆనాడు సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందని, కానీ ఎవరూ గట్టిగా నిలదీయలేకపోయారని అన్నారు. అప్పట్లో సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్‌తో జరిగిన సమావేశానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, అయితే తాను ఆ సమావేశానికి హాజరు కాలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ తోసిపుచ్చారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని అనగా, అది సరికాదని బాలకృష్ణ అన్నారు. వాస్తవానికి ఎవరూ జగన్‌ను గట్టిగా అడగలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చాడని అనడం అబద్ధం అని స్పష్టం చేశారు. ఆయనను (చిరంజీవిని) అవమానించారన్నది ఓకే... కానీ ఆయన చెబితే జగన్ దిగొచ్చాడంట అనేది నిజం కాదు అని వివరించారు.

ఇటీవల విడుదల చేసిన ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) జాబితాలో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉండటంపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. "ఆ జాబితాను ఎవరు తయారు చేశారు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో మాట్లాడినట్లు కూడా సభకు వెల్లడించారు. 


More Telugu News