Chris Wright: నేను భారత్‌కు పెద్ద అభిమానిని, ఆ దేశమంటే చాలా ఇష్టం: అమెరికా మంత్రి

Chris Wright I am a big fan of India says US Minister
  • భారత్‌తో ఇంధన వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నామని వ్యాఖ్య
  • అద్భుతమైన మిత్ర దేశం భారత్‌తో ఇంధన సహకారాన్ని విస్తరించుకోవాలన్న మంత్రి
  • న్యూఢిల్లీపై పెనాల్టీలు విధించాలని అమెరికా కోరుకోవడం లేదన్న క్రిస్ రైట్
భారత్‌కు తాను పెద్ద అభిమానినని, ఆ దేశమంటే తనకు చాలా ఇష్టమని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ అన్నారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో ఇంధన వాణిజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ అద్భుత మిత్ర దేశమైన భారత్‌తో అమెరికా ఇంధన సహకారాన్ని విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం భారత్ మరో అంశంలో చిక్కుకుందంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలును ఉద్దేశించి అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాల్సిన అవసరం భారత్‌కు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తక్కువ ధరకు లభించడం వల్ల ఆ కొనుగోళ్లను కొనసాగిస్తోందని అన్నారు. కానీ చమురు విక్రయాలతో వచ్చిన ఆదాయాన్ని రష్యా యుద్ధానికి వినియోగిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి అలాంటి దేశంతో వాణిజ్యాన్ని భారత్ ముగించుకుంటే బాగుంటుందని హితవు పలికారు.

న్యూఢిల్లీపై పెనాల్టీలు విధించాలని అమెరికా కోరుకోవడం లేదని క్రిస్ రైట్ స్పష్టం చేశారు. కేవలం యుద్ధాన్ని ముగించాలని మాత్రమే చూస్తున్నామని వెల్లడించారు. భారత్ తమ ఇంధన దిగుమతుల గురించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. న్యూఢిల్లీతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Chris Wright
US Energy Secretary
India
USA
India US relations
Russia oil

More Telugu News