Thatala Sangham: తల్లిదండ్రులను వేధిస్తున్న బిడ్డలకు బుద్ధిచెప్పే తాతల సంఘం
- ఫిర్యాదు అందుకున్నాక తొలుత మంచి మాటలతో సర్దిచెప్పే ప్రయత్నం
- అప్పటికీ వినకుంటే ఇంటి ముందు వంట చేసుకుని తింటూ నిరసన
- కామారెడ్డి జిల్లా మోతె గ్రామంలో వృద్ధుల సంఘం
కని, పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో భారంగా చూసే సంతానానికి బుద్ధి చెప్పేందుకు కొంతమంది వృద్ధులు కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ‘తాతల సంఘం’ పేరుతో రిజిస్టర్ కూడా చేసుకున్నారు. తమ పిల్లలు వేధిస్తున్నారని గ్రామంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే ఈ సంఘం సభ్యులంతా వెళ్లి వారికి నచ్చజెబుతారు. ముందు అనునయంగా చెబుతారు.. వినకుంటే హెచ్చరిస్తారు. అప్పటికీ వినకుండా మొండిగా వ్యవహరిస్తే ఇక అంతే.. ఆ రోజు నుంచి వారి ఇంటిముందే తిష్టవేస్తారు. అక్కడే వంట చేసుకుని తింటూ నిరసన ప్రదర్శన చేపడతారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మోతె గ్రామంలో ఉందీ తాతల సంఘం.
ఎలా ఏర్పడిందంటే..
మోతె గ్రామంలో గతంలో పలువురు వృద్ధులు తమ పిల్లలు సరిగా చూడటం లేదని, మాటలతో వేధిస్తున్నారని సర్పంచ్ కు ఫిర్యాదు చేస్తుండేవారు. సర్పంచ్ మందలింపుతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగినా కొన్ని రోజుల తర్వాత పునరావృతమయ్యేది. దీంతో గ్రామంలో వృద్ధులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో 2010లో అప్పటి సర్పంచ్ గడ్డం రాజిరెడ్డి ఈ తాతల సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈ సంఘానికి ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంఘంలో 40 మంది వృద్ధులు సభ్యులుగా ఉన్నారు.