KTR: ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. రాజ్‌భవన్‌కు చేరిన ఫైల్

KTR Formula E Case Intensifies File Reaches Governor
  • కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్‌భవన్‌కు చేరిన దస్త్రం
  • ఫైల్‌పై న్యాయనిపుణుల అభిప్రాయం కోరుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • కేటీఆర్ ఆదేశాలతోనే రూ. 54.88 కోట్ల నష్టం జరిగిందన్న ఏసీబీ నివేదిక
  • విజిలెన్స్ కమిషనర్ కూడా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్
  •  ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై చర్యలకు కేంద్ర అనుమతి కోసం లేఖ
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సంబంధిత దస్త్రం రాజ్‌భవన్‌కు చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఫైల్‌ను అందుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, దీనిపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వారి సూచనల అనంతరం గవర్నర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

అంతకుముందు, ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఏసీబీ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషనర్ కూడా ఇందుకు పచ్చజెండా ఊపారు. ఈ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ అనుమతి కోసం ఫైల్‌ను ముందుకు పంపింది.

ఏసీబీ నివేదికలో కీలక ఆరోపణలు
ఫార్ములా ఈ-రేసు ఒప్పందం నుంచి నిధుల చెల్లింపుల వరకు అనేక నిబంధనలను ఉల్లంఘించారని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా రెండు విడతల్లో విదేశీ కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 54.88 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ మొత్తం జరిగిందని చెప్పడానికి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఏసీబీ తెలిపినట్లు సమాచారం.

ఈ కేసులో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఫార్ములా ఈ-ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థ, ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఎండీలను ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌పై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీంతో, ఆయనపై ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లేఖ రాయనున్నట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ నిధులను క్యాబినెట్ అనుమతి లేకుండా చెల్లించారంటూ పురపాలకశాఖ కార్యదర్శి దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదుతో గతేడాది ఏసీబీ ఈ కేసు నమోదు చేసిన విషయం విదితమే.
KTR
KTR Formula E case
Formula E Hyderabad
Telangana politics
ACB investigation
Arvind Kumar IAS
BRS party
Governor Telangana
Corruption case
Telangana government

More Telugu News