Ishant Sharma: పాపం పాక్ క్రికెటర్లు.. వారిపై నాకెందుకో బాధేస్తోంది: ఇషాంత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Ishant Sharma comments on Pakistan cricket team condition
  • సొంత అభిమానుల నుంచే వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటోందన్న ఇషాంత్ 
  • ప్రతిభ, మౌలిక సదుపాయాల్లో భారత్‌తో పాక్‌కు పోలికే లేదని స్పష్టీకరణ
  • ఒకప్పటి పాక్ జట్టు వేరు, ఇప్పటి జట్టు వేర‌న్న ఇషాంత్
భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, గత కొన్నేళ్లుగా రెండు జట్ల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, పాకిస్థాన్ జట్టు పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిని చూస్తుంటే కొన్నిసార్లు జాలి వేస్తోందని ఆయన అన్నాడు.

ఇటీవల రాజ్ షమాని పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఇషాంత్ శర్మ, పాక్ క్రికెటర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మాట్లాడాడు. "పాకిస్థాన్ జట్టుపై ఇప్పటికే చాలా ఒత్తిడి ఉంది. మ్యాచ్‌లు చూస్తుంటే, వారి అభిమానులే స్టాండ్స్ నుంచి గట్టిగా అరుస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే, వాళ్లను చూస్తే నాకు కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది" అని ఇషాంత్ పేర్కొన్నాడు.

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఒత్తిడి సహజమే అయినా, ఒకప్పటి పాక్ జట్టుతో ఇప్పటి జట్టును పోల్చలేమని ఇషాంత్ అభిప్రాయపడ్డాడు. "గతంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్, అఫ్రిది వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పుడు ఒత్తిడి వేరేలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిభ, మౌలిక సదుపాయాలు, ఆటగాళ్లకు లభించే ప్రోత్సాహం వంటి విషయాల్లో భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ దరిదాపుల్లో కూడా లేదు" అని అన్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్‌ను రెండుసార్లు చిత్తుగా ఓడించింది. ఈ రెండు జట్ల మధ్య గణాంకాల్లో భారీ తేడా ఉన్నందున, పాకిస్థాన్‌ను ఇకపై తమకు ప్రత్యర్థిగా పరిగణించలేమని ఇటీవలే సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Ishant Sharma
Pakistan cricket
India Pakistan rivalry
Wasim Akram
Waqar Younis
Shoaib Akhtar
Asia Cup 2025
Suryakumar Yadav
Salman Agha
Cricket

More Telugu News