రామాయణం నాటకం వేస్తూ కుప్పకూలి స్టేజిపైనే మరణించిన ’దశరథుడు‘.. వీడియో ఇదిగో!

  • హిమాచల్ ప్రదేశ్‌లో రామలీలా ప్రదర్శనలో విషాదం
  • గుండెపోటుతో 70 ఏళ్ల అమరేశ్ మహాజన్ మృతి
  • ఇదే తన చివరి ప్రదర్శన అని ముందే చెప్పిన వైనం
  • నటన అనుకుని కొద్దిసేపటి తర్వాత గ్రహించిన సహనటులు
  • 25 ఏళ్లుగా రామలీలాలో పాల్గొంటున్న అమరేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రామలీలా ప్రదర్శనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దశరథ మహారాజు పాత్రలో నటిస్తున్న 70 ఏళ్ల వృద్ధ నటుడు, సంభాషణలు చెబుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఇది కూడా నటనలో భాగమేనని తోటి నటులు, ప్రేక్షకులు భావించడంతో అసలు విషయం గ్రహించడానికి కొంత సమయం పట్టింది. ఈ హృదయ విదారక ఘటన చంబా ప్రాంతంలో చోటుచేసుకుంది.

చంబా చౌగాన్‌లో గత 25 ఏళ్లుగా రామలీలా ప్రదర్శనలో అమరేశ్ మహాజన్ అనే వ్యక్తి నటిస్తున్నారు. ఆయన ఎక్కువగా దశరథుడి పాత్ర లేదా రావణుడి పాత్రను పోషిస్తుంటారు. వయసు పైబడినప్పటికీ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొనేవారు. అయితే, ఇదే తన చివరి ప్రదర్శన అని, దీని తర్వాత తాను రిటైర్ అవుతానని ఆయన నిర్వాహకులతో చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ మాటే నిజమైంది.

నిన్న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో రామలీలా ప్రదర్శన జరుగుతోంది. సింహాసనంపై కూర్చుని ఉన్న అమరేశ్ మహాజన్, దశరథుడి పాత్రలో సంభాషణలు చెబుతున్నారు. ఉన్నట్టుండి ఆయన పక్కనే ఉన్న సహనటుడి భుజంపై ఒరిగిపోయారు. తొలుత అయోమయానికి గురైనప్పటికీ, అందరూ అది నటనలో భాగమేమోనని భావించారు. దాదాపు 10 సెకన్ల తర్వాత ఆయనలో కదలిక లేకపోవడంతో అనుమానం వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. వెంటనే తెర దించి, ఆయన్ను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై శ్రీ రామ్ లీలా క్లబ్ అధ్యక్షుడు స్వపన్ మహాజన్ మాట్లాడుతూ "అమరేశ్ వేదికపైనే కుప్పకూలిపోయారు. వెంటనే మేం ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాం, కానీ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. ఆయన ఆకస్మిక మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన రామలీలా ప్రదర్శనలో రాముడి పాత్రధారి కూడా ఇలాగే గుండెపోటుతో మరణించిన ఘటనను పలువురు గుర్తుచేసుకుంటున్నారు.


More Telugu News