: పంటి పుచ్చుతో పార్కిన్సన్స్ ముప్పు.. పరిశోధనలో బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ నిజాలు!

  • పార్కిన్సన్స్ వ్యాధికి, నోటిలోని బ్యాక్టీరియాకు సంబంధం
  • దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాపై దక్షిణ కొరియా పరిశోధన
  • ఈ బ్యాక్టీరియా పేగుల్లో చేరితే మెదడు నాడీ కణాలపై తీవ్ర ప్రభావం
  • ఇది ఉత్పత్తి చేసే రసాయనాలు నాడీ కణాలను దెబ్బతీస్తున్నట్లు గుర్తింపు
  • ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో పార్కిన్సన్స్ లక్షణాల నిర్ధారణ
సాధారణంగా దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాకు, మెదడును తీవ్రంగా ప్రభావితం చేసే పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నోటిలో ఉండే ఈ సూక్ష్మజీవులు పొరపాటున పేగుల్లోకి చేరితే, అవి మెదడులోని నాడీ కణాలను దెబ్బతీసి పార్కిన్సన్స్ వ్యాధికి కారణమవుతున్నాయని దక్షిణ కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో కొత్త చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే... ‘స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్’ అనే బ్యాక్టీరియా సాధారణంగా మన నోటిలో ఉంటూ పంటి పుచ్చుకు కారణమవుతుంది. అయితే, ఈ బ్యాక్టీరియా పేగుల్లోకి చేరినప్పుడు ‘ఇమిడజోల్ ప్రొపియోనేట్ (ImP)’ అనే ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ రసాయనం రక్తం ద్వారా మెదడుకు చేరి, అక్కడ డోపమైన్‌ను ఉత్పత్తి చేసే నాడీ కణాలను నాశనం చేస్తోందని వారి అధ్యయనంలో వెల్లడైంది. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల పేగులు, రక్తంలో ఈ బ్యాక్టీరియా, అది ఉత్పత్తి చేసే రసాయనం అధిక మోతాదులో ఉన్నట్లు కనుగొన్నారు.

ఈ సిద్ధాంతాన్ని నిరూపించేందుకు, శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. కొన్ని ఎలుకల పేగుల్లోకి ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టగా, వాటిలో పార్కిన్సన్స్ లక్షణాలు కనిపించాయి. వాటిలో మెదడు నాడీ కణాల నష్టం, శరీర కదలికల్లో మందగమనం, ఆల్ఫా-సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ పేరుకుపోవడం వంటి మార్పులను గమనించారు. ఈ ప్రక్రియ మొత్తం ‘mTORC1’ అనే సిగ్నలింగ్ ప్రోటీన్ యాక్టివేట్ అవడం వల్లే జరుగుతోందని నిర్ధారించారు.

“నోటిలోని సూక్ష్మజీవులు పేగుల ద్వారా మెదడును ఎలా ప్రభావితం చేస్తాయో, పార్కిన్సన్స్ వ్యాధికి ఎలా దారితీస్తాయో మా అధ్యయనం స్పష్టంగా వివరిస్తోంది” అని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ అరా కో తెలిపారు. అంతేకాకుండా, mTORC1 ప్రోటీన్ పనితీరును అడ్డుకునే మందును ఎలుకలకు ఇచ్చినప్పుడు, వాటిలో పార్కిన్సన్స్ లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు గమనించారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో పార్కిన్సన్స్ వ్యాధికి సరికొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం చేస్తాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధ్యయన వివరాలు ప్రఖ్యాత ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

More Telugu News