Maoists: మావోయిస్టుల అగ్ర నాయకత్వమే టార్గెట్.. కశ్మీర్ నుంచి దండకారణ్యానికి బలగాలు!

Maoists Top Leadership Targeted Forces from Kashmir to Forest
  • మావోయిస్టులపై తుది పోరుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
  • మధ్యభారతానికి భారీగా అదనపు బలగాల తరలింపు
  • వచ్చే మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం
  • కీలక నేతలే టార్గెట్‌గా భద్రతా బలగాల ఆపరేషన్
  • మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన బలగాలు
  • సీనియర్ నేతల మరణంతో మావోల ఆత్మరక్షణ వ్యూహం
మావోయిస్టుల ప్రాబల్యాన్ని దేశం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తుది పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా మధ్యభారతంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు భారీగా అదనపు బలగాలను తరలించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ‘మావోయిస్టు రహిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా ఈ నిర్ణయాత్మక చర్యలకు ఉపక్రమించింది.

ఇటీవల అమర్‌నాథ్ యాత్ర భద్రత కోసం జమ్మూకశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాల్లో (సీఏపీఎఫ్) సుమారు 80 శాతం దళాలను ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు పంపనున్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ బలగాలు రెడ్ జోన్‌కు చేరుకుంటాయని సీఏపీఎఫ్‌లోని సీనియర్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని భౌతికంగా నిర్వీర్యం చేయడం, వారి అధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

కీలక నేతలే లక్ష్యంగా దాడులు
భద్రతా బలగాలు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని దాడులు ముమ్మరం చేశాయి. ఈ వ్యూహం ఫలితంగా ఈ ఏడాదిలోనే 8 మంది కేంద్ర కమిటీ సభ్యులను మట్టుబెట్టగా, మరొకరు లొంగిపోయారు. ఇటీవల ఒకే ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కీలక నేతలు కట్టా రామచంద్రారెడ్డి (రాజుదాదా), కడారి సత్యనారాయణరెడ్డి (కోసా) మరణించారు. మావోయిస్టు అగ్ర నాయకుల్లో చాలామంది ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా అడవుల్లోనే తలదాచుకున్నట్లు కేంద్ర హోంశాఖ వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మూడు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అగ్ర నేతలను కోల్పోయి ఆత్మరక్షణలో పడిన మావోయిస్టులు తాజాగా కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే, భద్రతా బలగాల దృష్టిని మళ్లించేందుకే ఇదొక ఎత్తుగడ అని కేంద్ర హోంశాఖ వర్గాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. మావోయిస్టులు ఇలాంటి ప్రతిపాదనలు చేయడం కొత్తేమీ కాదని, వాటికి ఎలాంటి సాధికారికత లేదని అధికారులు పెదవి విరిచారు. దండకారణ్య కమిటీ, కేంద్ర కమిటీలో మిగిలిన నాయకులను కూడా వదిలిపెట్టేది లేదని వారు స్పష్టం చేశారు.
Maoists
Chhattisgarh
Jharkhand
Odisha
Naxalites
India
Amaranth Yatra
Dandakaranya
Kashmir
encounter

More Telugu News