GST: ఈ-కామర్స్ వేదికలపై జీఎస్టీ తగ్గింపులపై ఓ కన్నేసిన కేంద్రం!

GST Rate Cuts on E commerce Platforms Under Government Scrutiny
  • జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు తగ్గిన ధరలు
  • ధరల మార్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతోందన్న కేంద్రం 
  • కంపెనీలు పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకపోతే చర్యలు తప్పవన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలితంగా నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గాయి. పన్ను శ్లాబులను 5 శాతం, 18 శాతానికి పరిమితం చేయడం ద్వారా వినియోగదారులకు ధరల తగ్గింపు ప్రయోజనం చేకూరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఈ-కామర్స్ సంస్థలు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ధరల మార్పులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు అమలు తీరును పరిశీలించి, సెప్టెంబర్ 30 నాటికి క్షేత్రస్థాయి నివేదిక అందుతుందని వివరించింది.

ధరల విషయంలో మొండిగా వ్యవహరిస్తే కంపెనీలపై చర్యలు తప్పవని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. యాంటీ-ప్రాఫిటీరింగ్ మెకానిజం అమల్లో ఉందని, పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు పంపింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కొన్ని సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయని, పన్ను తగ్గింపును పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయని తెలిపింది.

లగ్జరీ వస్తువులు, పొగాకు, మద్యం వంటి వాటిపై గరిష్టంగా 40 శాతం వరకు పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే.

వినియోగదారులకు ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తున్నారని భావిస్తే, సంబంధిత యాంటీ-ప్రాఫిటీరింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. 
GST
GST reduction
E-commerce
Tax reduction
Consumer benefits
Anti-profiteering
Price monitoring
Ministry of Finance
Tax slabs
Price hike

More Telugu News