Nara Lokesh: 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ'పై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Clarifies on Visakha Steel Plant Privatization
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేశ్ హామీ
  • రూ.11,440 కోట్లతో కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిందని వెల్లడి
  • ప్రతిపక్ష వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని తీవ్ర విమర్శలు
  • మహిళల గౌరవంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం
  • కియా రాకతో అనంతపురం రూపురేఖలు మారాయని వెల్లడి
  • ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమారస్వామికి లోకేశ్ ధన్యవాదాలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా నెలకొన్న ఆందోళనలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలి వేదికగా తెరదించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగారం పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

నేడు శాసనమండలిలో రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ, ప్రతిపక్ష వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శలు చేయడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అనేక పెద్ద పరిశ్రమలను తీసుకువచ్చినట్లు లోకేశ్ గుర్తుచేశారు. ముఖ్యంగా, అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ పరిశ్రమను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని తెలిపారు. "కియా రాకముందు అనంతపురం జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం రూ.70 వేల కంటే తక్కువగా ఉండేది. ఆ పరిశ్రమ, దాని అనుబంధ యూనిట్ల రాకతో అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, తలసరి ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది" అని ఆయన వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి పెట్టుబడులు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

మండలిలో తీవ్ర వాగ్వాదం

ఇదే చర్చ సందర్భంగా, మహిళల గౌరవం అనే అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేతలు మహిళల గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని లోకేశ్ విమర్శించారు. "నిండు సభలో నా తల్లిని దారుణంగా అవమానించినప్పుడు ఈ నేతలకు మహిళల గౌరవం గుర్తుకు రాలేదా? ఆ అవమానంతో ఆమె కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మా పార్టీ మహిళలపై అక్రమ కేసులు పెట్టినప్పుడు వీరు ఏం చేశారు? మహిళలను అవమానించే వైసీపీ నేతలకు వారి గౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు" అని లోకేశ్ తీవ్ర స్వరంతో అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విశాఖ ఉక్కు వంటి రాష్ట్ర ఆస్తులను కాపాడటంలో వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Nara Lokesh
Visakha Steel Plant
Vizag Steel Plant Privatization
Andhra Pradesh Industries
Kia Motors Anantapur
AP Assembly
HD Kumaraswamy
Narendra Modi
TDP Government
Andhra Pradesh Economy

More Telugu News